ఖలీల్‌వాడి, ఆగస్టు 3: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్నాయి. కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఏకంగా హత్యలకు దారి తీస్తున్నాయి. మరొకరి మోజులో పడిన భర్త/భార్య తమ జీవిత భాగస్వాములను అంతమొందించేందుకూ వెనుకాడడం లేదు. తమ బంధానికి అడ్డుగా ఉన్నారని కట్టుకున్న వారినే ఖతం చేస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. మొన్న ఓ భార్య తన భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి చంపేస్తే, తాజాగా మరో భార్య కూరలో గడ్డి మందు కలిపి భర్త, అత్తను హతమార్చేందుకు యత్నించింది. మోపాల్ మండలంలో నెల వ్యవధిలోనే వెలుగు చూసిన ఈ దారుణాలు విచ్ఛిన్నమవుతున్న కుటుంబ బంధాలకు ఉదాహరణగా మారాయి.
ప్రియుడి మోజులో పడిన ఓ ఇల్లాలు ఇంటాయనను ఖతం చేయాలని ప్లాన్ వేసింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని భర్తతో పాటు అత్తపై హత్యాయత్నానికి పాల్పడింది. కూరలో గడ్డి మందు కలిపి వారికి వడ్డించింది. అత్త వాంతులు, విరేచనాలతో దవాఖానలో చేరగా, అప్రమత్తమైన భర్త తినడం ఆపేయడంతో బతికి బయటపడ్డారు. మోపాల్ మండలం మొదక్పల్లిలో శనివారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్సై సుష్మిత సోమవారం వెల్లడించారు. ముదక్పల్లి గ్రామానికి చెందిన పొట్టోళ్ల భూమన్న తన భార్య సోని, తల్లి భూదేవితో కలిసి ఉంటున్నాడు. అయితే, సోనీ మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నది.
ఈ క్రమంలో తమ బంధానికి భర్త, అత్త అడ్డుగా ఉన్నారని , వారిని చంపాలని కుట్ర పన్నింది. శనివారం మీల్మేకర్ కూర వండిన సోనీ.. అందులో గడ్డి మందు కలిపింది. భోజనం చేసిన అత్తకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఆ తర్వాత భర్త అదే కూరను తింటుండగా, పురుగుమందు వాసన రావడంతో అనుమానం వచ్చి తినడం ఆపేశాడు. అప్పటికే తల తిరుగుతుండడంతో భూమన్న, భూదేవిలను నిజామాబాద్‌లోని ప్రభుత్వ దవాఖానకు తరలించగా, సకాలంలో వైద్యం అందడంతో ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సోనీని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. నిందితురాలిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై సుష్మిత తెలిపారు.
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ ఇల్లాలు తన భర్తకు హార్పిక్ ఎక్కించి అంతమొందించింది. జూలై 6న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మోపాల్ మండలం న్యాల్కల్కు చెందిన ప్రశాంత్ (35), సంధ్య దంపతులు. కుటుంబ పోషణ నిమిత్తం ప్రశాంత్ కొన్నేండ్లుగా దుబాయ్‌కి వెళ్లి వస్తున్నాడు. నిజామాబాద్‌లోని ప్రైవేట్ దవాఖానలో నర్సుగా పని చేసే సంధ్య, నగరానికి చెందిన అనిల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే, భర్త ప్రశాంత్ జూన్ 27న దుబాయ్ నుంచి తిరిగి వచ్చాడు. అనిల్‌తో తన సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపాలని సంధ్య ప్లాన్ వేసింది.
న్యాల్కల్కు చెందిన బంటి సహకారంతో అతడి హత్యకు కుట్ర పన్నింది. జూన్ 29న ప్రశాంత్, బంటి కలిసి తమ ఇంటి దాబాపై మద్యం సేవించేలా ఏర్పాట్లు చేసింది. ఫుల్లుగా మద్యం తాగిన భర్తను సంధ్య, బంటి కలిసి దాబా పైనుంచి కిందకు తోసేయగా, ప్రశాంత్ గాయాలతో బయట పడ్డాడు. దవాఖానలో చికిత్స అనంతరం ఇంటికి వచ్చిన భర్త ఎక్కడ కోలుకుంటాడోనని భావించిన సంధ్య.. అతని చేతికి ఉన్న క్యాన్లా ద్వారా హార్పిక్‌ను ఎక్కించింది. పరిస్థితి విషమించి ప్రశాంత్ చనిపోయాడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా, హత్య విషయం వెలుగు చూసింది. సంధ్య, అనిల్, బంటిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.