రోజురోజుకూ చలి పెరిగిపోతున్నది. ఈ వాతావరణంలో ఆకలి కూడా బాగా తగ్గిపోతుంది. కొంచెం తినగానే.. కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి సమయంలో వేడివేడి ‘పాయా సూప్’.. బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తుంది. ‘వింటర్ స్పెషల్’గా పిలుచుకునే ఈ ఎముకల పులుసు.. శీతకాలంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
పాయా సూప్‌లో కాల్షియం, సోడియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌తోపాటు అనేక రకాల మినరల్స్ ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయి. పోషకాహార లోపాన్ని నివారిస్తాయి.
పాయా సూప్‌లో ఉండే యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు.. దగ్గు, జలుబు లక్షణాలను తగ్గించడంలో ముందుంటాయి.
శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో పాయా సూప్ సమర్థంగా పనిచేస్తుందని న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక చెబుతున్నది.
ఇందులో క్యాలరీలు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇందులో లభించే జిలాటిన్ అనే పదార్థం.. కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. దాంతో ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గాలని అనుకునేవారికి.. పాయా సూప్ మంచి చాయిస్!
పేగుల్లో మంటను తగ్గించే ఎల్-గ్లుటామైన్ అనే అమైనో ఆమ్లం.. ఎముకల పులుసులో పుష్కలంగా లభిస్తుంది. కడుపులో మంటను ఇట్టే తగ్గిస్తుంది.
శరీరంలో కొలాజెన్, హైలురోనిక్ యాసిడ్ ఉత్పత్తికి పాయా సూప్ భరోసా ఇస్తుంది. ఫలితంగా.. చర్మ ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తుంది. ముఖంపై ముడతల సమస్యను తగ్గించడంలోనూ ముందుంటుంది.
మేక, గొర్రెల కాళ్ల ఎముకలతో చేసే ఈ సూప్.. ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా.. ముప్పయ్ ఏళ్లు దాటిన మహిళల ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది. చలికాలంలో దాడిచేసే వైరస్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని ఇస్తుంది. కాబట్టి, చలికాలంలో వారంలో ఒకసారైనా ఎముకల పులుసును తీసుకోవాలని ఆహార నిపుణుల సూచన.