న్యూఢిల్లీ, నవంబర్ 24 : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. డిసెంబర్ 20 వరకు జరిగే ఈ సమావేశాల్లో వక్ఫ్ (సవరణ) సహా 16 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. మణిపూర్ హింస, గౌతమ్ అదానీ అవినీతి చర్యలపై యూఎస్ అరెస్ట్ వారెంట్ తదితర అంశాలపై ఈ సమావేశాల్లో మోదీ సర్కారును నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి విపక్షం పట్టుబట్టవచ్చు. దేశమంతా ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన జమిలి ఎన్నికల బిల్లును లిస్టులో చేర్చకపోయినా దానిని ప్రవేశపెట్టవచ్చునని భావిస్తున్నారు. కాగా, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశంలో విజ్ఞప్తి చేసింది. అయితే అదానీ అవినీతి, మణిపూర్ అల్లర్లపై చర్చ జరగాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు.
రాజ్యాంగ ఆమోద 75వ వార్షికోత్సవ వేడుకల ప్రారంభోత్సవానికి గుర్తుగా మంగళవారం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాత పార్లమెంట్ భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్లో ప్రసంగిస్తారు. ‘హమారా సంవిధాన్, హమారా స్వాభిమాన్’ పేరుతో ఏడాది పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్టు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆదివారం తెలిపారు.