ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 5 : చలితో పల్లెలు వణుకుతున్నాయి. ఈ ఏడాది చలి తీవ్రత పెరగడంతో ప్రజలు రాత్రివేళలో బయటికి వెళ్లేందుకు జంకుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న చలి తీవ్రతకు వ్యాధులు విజృంభించే అవకాశాలున్నాయని వైద్యనిఫుణులు హెచ్చరిస్తున్నారు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తూ ఆహార అలవాట్లలో మార్పులు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవని వారు సలహాలిస్తున్నారు. రాత్రివేళలో, తెల్లవారుజామున చల్లటి గాలులు వీస్తూ కనిష్ట ఉష్ణోగ్రత్త 15తతడిగ్రీలకు పడిపోతుంది. చలికాలంలో శరీర వ్యవస్థలో మార్పులతో చిన్నపిల్లలతో పాటు వృధ్దులలో వ్యాధులు సంక్రమించే అవకాశమున్నది. రాత్రివేళల్లో, తెల్లవారుజామున చల్లటి గాలులు వీస్తుండడంతో తీవ్రత కనిపిస్తున్నది. చలికాలంలో శరీర వ్యవస్థలో మార్పుల వల్ల పిల్లలతో పాటు వృద్ధులకు కూడా వ్యాధులు వచ్చే అవకాశమున్నది. ముందు జాగ్రత్తలు తీసుకుంటూ సరైన సలహాలు, సూచనలు పాటిస్తే, చలి రోగాల భారీనుంచి ఉపశమనం దొరుకుతుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
తీసుకోవల్సిన జాగ్రత్తలు..
చలిమంటలు కాపుకోవద్దు..
చాలామంది అటవీ గ్రామాల్లో చలి తీవ్రతకు చలిమంటలు పెట్టుకుంటారు. దీంతో అనేక ప్రమాదాలు సంభవిస్తాయి. ఒక్కొసారి మంటలకు కళ్లు గిర్రున తిరిగి కిందపడిపోతారు. లోబీపీకి గురవుతారు. దుప్పట్లు కప్పుకుని చాలామంది మంటల వద్ద కూర్చుంటారు. అప్పుడప్పుడు మంటలు దుప్పట్లు అంటుకునే ప్రమాదాలు కూడా ఉంటాయి. చిన్నపిల్లలను మంటల వద్దకు ఎట్టి పరిస్థితిల్లో రానివ్వకూడదదు.
ఆస్తమా..
చలికాలంలో ఊపిరితిత్తుల్లో శ్వాసకోశ నాళాలు కుచించుకుపోయి. గాలి సరిగా అందదు. దీంతో గాలి తీసుకోవడం, వదలడం ఇబ్బంది కలుగుతుంది. ఆయాసం, దగ్గు అధికంగా వస్తుంది. పసిపిల్లల్లో జలుబు, దగ్గును అశ్రద్ద చేస్తే న్యూమోనియా వస్తుంది. ఈ వ్యాధివల్ల పక్కటెముకలు ఎగరేయడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి నిమ్ముచేరి కొన్ని సందర్భాల్లో మరణం సంభవిస్తున్నది. చిన్నపిల్లలకు ఆరునెలల వరకు తల్లిపాలు తాగిస్తే నిమ్ము చేరకుండా ఉంటుంది.
లక్షణాలు..
ఆస్తమా అధికశాతం వంశపారపర్యంగా సక్రమిస్తుంది. ఛాతి పట్టేసినట్లు ఉండడం, ఆయాసం, దగ్గు, శ్వాస సక్రమంగా తీసుకోకపోవడం ఈ వ్యాధి లక్షణాలు, కాలుష్యం వల్ల కూడా ఆస్తమా సంక్రమిస్తుంది. ఆస్తమా చిన్న పెద్దా తేడా లేకుండా ఎవరికైనా వస్తుంది. ఈ వ్యాధితో పెద్దగా ఇబ్బంది లేకపోయినా చలికాలం ముగిసేదాకా ఇబ్బందులు తప్పవు.
పాటించాల్సిన జాగ్రత్తలు..
చలికాలంలో జాగ్రత్తలు పాటించాలి
చలికాలంలో ప్రతి ఒక్కరూ సరైన జాగ్రత్తలు పాటించాలి. ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న వారు, చిన్నపిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చలికాలంలో జలుబు, దగ్గు, శ్వాసకోశ వ్యాధులు అధికంగా రావడానికి అవకాశముంటుంది. ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలి. ముఖ్యంగా చలికాలంలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం తగ్గించాలి. చలికి ఎక్కువగా తిరగకూడదు. చలిమంటలు కాపకూడదు. ముఖ్యంగా చర్మంపై అశ్రద్ధ వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.