నార్నూర్ : ఏజెన్సీ గిరిజనేతరులు ( Agency issues ) ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ కార్మిక ఉపాధి శిక్షణ , కర్మాగారాల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి (Minister Gaddam Vivek ) అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రాన్ని ఆయన పర్యటించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం త్రిరత్న బుద్ధ విహార్లో గౌతమ బుద్ధుని ప్రతిమకు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా బహుజన నాయకులు ఏజెన్సీలో ఎదుర్కొంటున్న సమస్యలు విన్నవించారు. ఏజెన్సీలో సాగు చేసుకుంటున్నా భూములకు పహాణీలు ఇవ్వాలని, మెరుగైన విద్య కోసం ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేయాలని, ఇరిగేషన్ కోసం ఎంపల్లి ప్రాజెక్టులు మంజూరు చేయాలని కోరారు. అంబేద్కర్ భవనం, బంజారా భవనం, షాదీఖానా వంటి భవనాలు మంజూరు చేయాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, నాయకులు ఆత్రం సుగుణ, అజ్మీరా శ్యాం నాయక్, మాజీ సర్పంచ్ బానోత్ గజానంద్ నాయక్, నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, దళిత అవార్డు గ్రహీత నర్సింగ్ మోరే, మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు లోకొండే చంద్రశేఖర్, దుర్గే కాంతారావు తదితరులున్నారు.