నార్నూర్ : మండలంలో అడవి పందుల ( Wild boar ) బెడద రోజు రోజుకు పెరిగిపోతుంది. విత్తనాలు(Seed) మొలకెత్తిన దశలోనే పందులు పంటలను ధ్వంసం ( Crop Damage ) చేస్తున్నాయి. ఆరుగాలం సేద్యం చేసి, లక్షల పెట్టుబడి పెట్టి పండిస్తున్న అన్నదాతలకు అగచాట్లు తప్పడం లేదు. విత్తనం నాటిన నుంచి పంట చేతికొచ్చే వరకు అడవి పందులు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాలలో అడవి పందులు రాత్రి, పగలు పంట పొలాల్లో తిరుగుతూ పంటలను ధ్వంసం చేస్తున్నాయి. వానాకాలం సీజన్ కావడంతో రైతులు ఎక్కువ శాతం పత్తి, కంది, పెసర, మినుము, బబ్బెర, మక్కా, వివిధ పంటలను సాగు చేస్తుంటారు. అడవి పందులు మొలకదశలోన పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. పంటలను ఎలా కాపాడుకోవాలంటూ రైతులు ఆందోళనకు గురువుతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి అడవిపందుల బెడద నుంచి పంటలను కాపాడుతూ రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.