జవహర్‌నగర్, మార్చి 5 : భర్త వేధింపులతో భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి ముత్తుస్వామికాలనీలో చోటుచేసుకుంది. ఎస్‌హెచ్‌వో సైదయ్య తెలిపిన ప్రకారం.. జవహర్‌నగర్ కార్పొరేషన్ బాలాజీనగర్ ముత్తుస్వామికాలనీకి చెందిన వారు గత ఫిబ్రవరిలో మహేశ్, రమ్య(23) ప్రేమ పెండ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి మహేశ్ పని లేకుండా తిరుగుతూ మద్యానికి డబ్బులు కావాలని రమ్యను వేధించేవాడు. గత రెండురోజుల కిందట మహేశ్ అతిగా మద్యం తాగి రమ్యను కొట్టాడు. ఈ విషయాన్ని రమ్య తల్లిదండ్రులకు చెప్పగా.. వారు సర్దిచెప్పి ఇంటికి పంపించారు. ఈనెల 4న మహేశ్ తాగివచ్చి భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.దీంతో మనస్థాపానికి గురైన రమ్య మంగళవారం రాత్రి ఇంట్లోని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.రమ్య తల్లి ఐలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసి పోలీసులు నిందితుడు దాసరి మహేశ్‌ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.