అమరావతి : ఏపీలో సంచలనం రేపిన ఐదుగురు విద్యార్థుల అదృశ్యంపై పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు ప్రారంభించారు. విద్యార్థులు అదృశ్యమై 24 గంటలు దాటిపోవస్తున్నా వారి జాడ తెలియకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. నిన్న తిరుపతి పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న అయిదుగురు విద్యార్థులు పరీక్షలు అనంతరం కనిపించకుండా పోయారు. వీరిలో ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు.
ఇందులో నలుగురు 10వతరగతి , ఒకరు 9వతరగతి చదువుతున్న విద్యార్థులున్నారు. పాఠశాలలో ఉదయం పరీక్షలు రాసి ఇంటికి బయలు దేరిన విద్యార్థులు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి వాకబు చేసి పరిసరాల్లో గాలించారు. ఫలితం లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు , విద్యాశాఖాధికారి కలిసి పశ్చిమ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
విద్యార్థుల వద్ద సెల్ఫోన్ల ఆధారంగా వారి జాడ కనిపెట్టేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నామని, దీంతో పాటుగా పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు సీఐ శివప్రసాద్ తెలిపారు.