సూర్యాపేట, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : జిల్లా వైద్యారోగ్య శాఖకు అవినీతి జబ్బు పట్టింది. ఇక్కడ సస్పెండ్ అయిన ఉద్యోగికి సగం జీతం ఇవ్వాలంటే లక్ష రూపాయలు ముట్టజెప్పాల్సిందే. ప్రసూతి సెలవులు కావాలన్నా, మెడికల్ లీవ్‌లో ఉన్నా వేతనాల్లో కోతలు సహజమే! ఇవన్నీ ఇటీవల వెలుగు చూసిన ఘటనలే. తాజాగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో అర్హత లేని డాక్టర్లు నడుపుతున్న ప్రైవేట్ దవాఖానలు, స్కానింగ్ సెంటర్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆకస్మిక తనిఖీల్లో వెలుగు చూశాయి.
సూర్యాపేట జిల్లావ్యాప్తంగా ఇలాంటివి వందకు పైనే ఉన్నట్లు ఐఎంఏ సభ్యులు చెప్తున్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు వాటికి అనుమతులు ఎలా ఇచ్చారు? ఎలా రెన్యూవల్ చేస్తున్నారు అనేది అనేక విమర్శలకు తావిస్తున్నది. కొనేండ్లుగా నడుస్తున్న ఈ తతంగంలో లక్షల రూపాయల అవినీతి జరుగుతున్నదని, నెలనెలా ముడుపులు ముడుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో జరుగుతున్న అవినీతి లీలలు అన్నీ ఇన్నీ కావు. మామూళ్లు ముట్టజెప్తే చాలు నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులైనా ఇస్తున్నారనే విమర్శలున్నాయి. డాక్టర్లు లేని ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్ల నుంచి నెలనెలా వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హత లేని డాక్టర్లు కొందరు ఆర్ఎంపీలకు కమీషన్ ఎర చూపి పేషెంట్లను చికిత్స పేరుతో పీల్చిపిప్పి చేయడం, సరైన వైద్యం అందని కారణంగా రోగులు చనిపోవడం వంటి ఘటనలు చాలానే ఉన్నాయి.
ఇంత జరుగుతున్నా వైద్యారోగ్య శాఖ అధికారులు తీసుకునే చర్యలు మాత్రం ఏమీ ఉండవు. కారణం.. మామూళ్ల మత్తేనన్నది సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తున్నది. ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, స్కానింగ్ సెంటర్ల తనిఖీల సమయంలో హడావిడి చేయడం, కొన్నింటిని సీజ్ చేస్తున్నట్లు ప్రకటించడం చేసినా.. ఆ తర్వాత అవే యాజమాన్యాలు తిరిగి ప్రారంభించడం గమనార్హం.
అప్పటివరకు న్న ఆసుపత్రి పేరుకు ముందో, వెనుకో చిన్న తోక తగిలించి తిరిగి వైద్యాన్ని అక్రమ వ్యాపారంగా దర్జాగా సాగిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇలాంటివన్నీ స్థానికంగా తీవ్ర విమర్శలకు తావిస్తున్నా ఖాతరు చేయడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా దవాఖానలు, స్కానింగ్ సెంటర్లు నిర్వహించడం, అర్హత లేని వైద్యుల వ్యవహారంపై వారం క్రితం సూర్యాపేట ఐఎంఏ సభ్యులు రంగంలోకి దిగి బహిరంగంగా హెచ్చరికలు చేశారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో మెడికల్ కౌన్సిల్ సభ్యులు గురువారం సూర్యాపేట పట్టణంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టగా విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి.
అర్హత లేని డాక్టర్లు, విచ్చలవిడిగా స్కానింగ్ సెంటర్లు
మెడికల్ కౌన్సిల్ సభ్యుల తనిఖీల్లో అర్హత లేని డాక్టర్లు రోగులకు వైద్యం అందిస్తున్నట్లు, స్కానింగ్ సెంటర్లు నడుపుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి చైనా, రష్యా, ఉక్రెయిన్ వంటి దేశాల్లో మెడిసిన్ చదివిన వారు ఇండియాలో వైద్యం అందించాలంటే క్వాలిఫైడ్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాంటివి రాయకుండా నేరుగా ఆయా దేశాల్లో చదివిన కోర్సులను పెట్టుకుని ఎండీ, జనరల్ ఫిజిషియన్ అంటూ బోర్డులు తగిలించుకుని వైద్యం చేస్తున్నారు.
తనిఖీలు చేసిన సమయంలో సూర్యాపేటలోని యాపిల్ స్కానింగ్ సెంటర్లో క్వాలిఫైడ్ కాని డాక్టర్ స్కానింగ్ చేస్తుండడం గుర్తించారు. సాయిగణేశ్ ఆసుపత్రిలో అర్హత లేని డాక్టర్ వైద్యం చేస్తుండడం బహిర్గతమైంది. శ్రీకృష్ణ ఆసుపత్రిలో బయటకు చెప్తున్న డాక్టర్లు ఎవరూ లేరు. స్థానికంగా ఉన్న అర్హత లేని వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకువచ్చి దవాఖాన నడపుతున్నట్లు తేలింది. తనిఖీల్లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ నరేశ్‌కుమార్, డాక్టర్ రాజీవ్, డాక్టర్ అరుంధతి ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు పొందిన ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లతోపాటు అర్హత లేని డాక్టర్లపై మెడికల్ కౌన్సిల్ మెంబర్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌కు వివరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
అక్రమాలు వాస్తవమే
-డాక్టర్ నరేశ్‌కుమార్,తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు
‘ఈ నెల 17న ఒకసారి, గురువారం మరొకసారి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు చేశాం. ఎక్కడైనా ఆసుపత్రికి అనుమతి కావాలంటే 2022 క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఆమోదం తెలుపుతుంది. చివరకు డీఎంహెచ్ఓ అనుమతులు ఇస్తారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికెట్ ఉండాలి. ఆసుపత్రిలో పని చేసేందుకు సంసిద్ధత వ్యక్త చేస్తూ అనుమతి పత్రం ఉండాలి. కానీ ఇక్కడ శరత్ కార్డియాక్ సెంటర్లో అసలు డాక్టరే లేరు. ఒక టెక్నీషియన్ టెస్టులు చేస్తున్నాడు.
యాపిల్ స్కాన్ సెంటర్లో ఎంబీబీఎస్ డాక్టర్‌కు రెన్యువల్ లేదు. మరో డాక్టర్‌కు తెలంగాణ కౌన్సిల్లో అనుమతి లేదు. శ్రీకృష్ణ ఆసుపత్రిలో అర్హత ఉన్న డాక్టర్ లేరు. ఈ శ్రీకృష్ణ ఆసుపత్రికి తెలంగాణ రిజిస్ట్రేషన్ కూడా లేదు. అల్ట్రా సౌండ్ సిస్టమ్‌కు ఏపీ ప్రభుత్వ వైద్యాధికారి పేరిట అనుమతలు ఉండగా, ఆయన ఆంధ్రాలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. వీటన్నింటికి ఎలా అనుమతులు ఇచ్చారో తేలాల్సి ఉంది’ అని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ నరేశ్‌కుమార్ తెలిపారు. వీటిలో జిల్లా వైద్యాధికారి ఏమైనా అక్రమాలకు పాల్పడ్డారా అని మీడియా ప్రశ్నించగా, అనుమానించాల్సిందే కదా! అని చెప్పుకొచ్చారు.