హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల తీరుపై విచారణకు సిట్ వేయాలని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు. మంత్రులపై కూడా అనేక ఆరోపణలు వచ్చాయని, వాటి మీద సిట్ ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. బుధవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘అధికార ఎమ్మెల్యేల అక్రమాలు ముఖ్యమంత్రికి కనబడటం లేదా? ఎందుకు సిట్ వేయరు? ప్రతిపక్షాలపై తప్పుడు ప్రచారం చేస్తే షట్.. మంత్రుల మీద కథనాలు వస్తే సిట్టా?’ అని నిలదీశారు. ‘మంత్రి కొండా సురేఖ బిడ్డ అనేక ఆరోపణలు చేసినా సిట్ ఎందుకు వేయలేదు? ములుగులో సీతక పీఏపై ఇసుక దందా ఆరోపణలొచ్చినా ఎందుకు విచారణ జరపడం లేదు? కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆరోపణలు చేసినా ఎందుకు పట్టించుకోలేదు? 20% కమీషన్లు తీసుకుంటున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబర్ ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేసినా సిట్ ఎందుకు వేయలేదు? ముఖ్యమంత్రి సోదరుల మీద అనేక ఆరోపణలు వచ్చినా ఎందుకు మౌనం వహించారు? పొంగులేటి కొడుకుపై భూ కబ్జా ఆరోపణలు వచ్చినా సిట్ ఎందుకు వేయలేదు?’ అని మె తుకు ఆనంద్ నిలదీశారు. వికారాబాద్ ఎమ్మెల్యే బుల్లెట్ రాజాగా మారారని, కమీషన్లు లేనిదే పనులు చేయడం లేదని, కాంట్రాక్టర్లు దగ్గరకు వెళ్లాలంటేనే భయపడుతున్నారన్నారు. ఎమ్మెల్యే అక్రమాలు సీఎంకు కనబడటం లేదా? అని ప్రశ్నించారు.
రేవంత్‌రెడ్డి సర్కార్ జర్నలిస్టులను అరెస్టు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నదని ఆనంద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నదీ, వారి మీద కథనాలు రాయిస్తున్నదీ రేవంత్రెడ్డేననే విషయం అందరికీ తెలుసని పేర్కొన్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు రేవంత్ కుట్రలు అర్థమయ్యాయని, అందుకే తనకు క్లీన్చిట్ ఇప్పించుకునేందుకే సీఎం సిట్ వేశారని ఆరోపించారు.
జాతీయ రహదారి- 44 విస్తరణ పనుల్లో మాజీ ఎమ్మెల్యే కాంట్రాక్టర్‌ను బెదిరించారని, వసూళ్లకు పాల్పడుతున్నారని, సీఎంకు ఇది తెలిసి కూడా ఎందుకు విచారణ చేయడం లేదని కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత నాగేందర్‌గౌడ్ ప్రశ్నించారు. ఏఐసీసీలో సంపత్‌కు పదవి ఉన్నదని, రాహుల్‌గాంధీ కూడా స్పందించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, తన పాలనా వైఫల్యాలను ప్రజలు ప్రశ్నించడాన్ని సీఎం రేవంత్‌రెడ్డి జీర్ణించుకోవడం లేదని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ విమర్శించారు. అర్ధరాత్రి జర్నలిస్టులను అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేత వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, మళ్లీ కేసీఆర్ పాలన రావాలని ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. సమావేశంలో వికారాబాద్ బీఆర్ఎస్ నేత ఆదిత్య పాల్గొన్నారు.