25 Hours | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్ (నమస్తే తెలంగాణ) : రోజులో ఎన్ని గంటలంటే.. 24 అని చెప్తాం. అయితే, భవిష్యత్తులో మరో గంటను జోడించి రోజుకు 25 గంటలు అని చెప్పాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూ భ్రమణ వేగం నెమ్మదించడంతో రోజులో మరో గంట అదనంగా చేరుతున్నట్టు జర్మనీలోని మ్యూనిక్ టెక్నికల్ యూనివర్సిటీ, అమెరికాలోని విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తెలిపారు.
భూమి నుంచి చంద్రుడు ఏటికేడు 3.8 సెంటిమీటర్ల చొప్పున దూరంగా జరుగుతుండటంతో గురుత్వాకర్షణ బలాల్లో తేడాలు రావడం, చంద్రుడి ప్రభావంతో సముద్రాల్లో ఏర్పడే అలల్లో మార్పులు, వాతావరణ ప్రభావం కారణంగా భూభ్రమణ వేగం తగ్గుతున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. భూమిలో 20 అడుగుల లోతులో ఉంచిన రింగ్ లేజర్ టెక్నాలజీతో ఈ మార్పులు కనుగొన్నట్టు పేర్కొన్నారు.
భూభ్రమణ వేగంలో మార్పుల వల్ల రోజులోని గంటల్లో మార్పులనేది కొత్తదేం కాదని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు. 1.4 బిలియన్ సంవత్సరాల కిందట భూమికి చంద్రుడు ఎంతో దగ్గరగా ఉండటంతో రోజులో 18 గంటలు మాత్రమే ఉండేవని చెప్తున్నారు.
రోజుకు 25 గంటలు అనేది ఇప్పటికిప్పుడు జరిగే మార్పేం కాదు. వచ్చే 20 కోట్ల ఏండ్ల తర్వాతనే ఈ మార్పు చూడొచ్చని పరిశోధకులు చెప్తున్నారు. అప్పుడు క్యాలెండర్లలో లెక్కలతో పాటు గ్లోబల్ సిస్టమ్‌లోని అటామిక్ క్లాక్ నుంచి ఎయిర్‌లైన్స్ వరకూ అన్నింట్లోనూ సర్దుబాట్లు చేయాల్సి ఉంటుంది.