Karnataka | బెంగళూరు, సెప్టెంబర్ 8: కర్ణాటక కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి చిచ్చు పెట్టింది. ముడా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య తన పదవి నుంచి తప్పుకున్నా, అధిష్ఠానమే ఆయనను తప్పించినా తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. గవర్నర్ తనపై విచారణకు ఇచ్చిన అనుమతిని సవాల్ చేస్తూ సిద్ధరామయ్య హైకోర్టులో వేసిన పిటిషన్ను విచారణ చేయడానికి కోర్టు అంగీకారం తెలిపింది. ఈ తరుణంలో సీఎం పదవి కోసం మొదలైన రేసులోకి రోజుకో నేత వస్తున్నారు. ఇప్పటివరకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లేదా హోంమంత్రి పరమేశ్వరలో ఒకరికి సీఎం పదవి దక్కవచ్చని అంతా భావించారు. అయితే, అనూహ్యంగా మంత్రి సతీశ్ జార్కిహోళి బీసీ కోటాలో తెరపైకి వచ్చారు. మరోవైపు కొందరు ఎమ్మెల్యేలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును అధిష్ఠానానికి సూచించాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
సీఎం పదవికి పోటీ పెరుగుతుండగానే మరోవైపు సీనియర్ మంత్రులు ఎంబీ పాటిల్, శివానంద్ పాటిల్ మధ్య ఇదే విషయమై మాటల యుద్ధం జరిగింది. ఎంబీ పాటిల్ అభ్యర్థిత్వంపై శివానంద్ పాటిల్ స్పందిస్తూ.. ‘ఆయన కంటే చాలామంది సీనియర్లు ఉన్నారు, ఆయన ఇంకొన్నాళ్లు వేచి ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. ‘నాకంటే చాలామంది సీనియర్లు ఉన్నారు, అయితే సీనియారిటీ మాత్రమే కొలమానం కాదు’ అంటూ ముఖ్యమంత్రి మార్పుపై మంత్రి ఎంబీ పాటిల్ స్పందించారు. మరోవైపు సీనియర్ ఎమ్మెల్యే ఆర్వీ దేశ్పాండే సైతం సీఎం కావాలనే తన ఆకాంక్షను బయటపెట్టారు. ఒక వైపు సీఎం పదవి కోసం చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, బయటకు మాత్రం అందరు నేతలు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగుతారని చెప్తున్నారు.
పార్టీ వాణిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సొంత మీడియా ఉండాలని కర్ణాటక కాంగ్రెస్ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో మొదటి దఫాలో ఒక యూట్యూబ్ చానల్ ప్రారంభించబోతున్నది. బీజేపీ నేతలు చరిత్రను వక్రీకరిస్తున్నారని, 50 ఏండ్లుగా కాంగ్రెస్ ఏమీ చేయలేదని చెప్తున్నారని, అందుకే తమ వాణి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యూట్యూబ్ చానల్ ప్రారంభించనున్నట్టు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జీసీ చంద్రశేఖర్ తెలిపారు. రెండో విడతలో ఒక వార్తాపత్రిక ప్రారంభించాలని అనుకుంటున్నట్టు చెప్పారు.