న్యూఢిల్లీ, మార్చి 17: గత నెల ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం మళ్లీ విజృంభించింది. ఇదే సమయంలో దేశీయ ఎగుమతులు మరోసారి నిరాశపర్చాయి. సోమవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత హోల్సేల్ ఇన్ఫ్లేషన్ 2.38 శాతంగా నమోదైంది. వంటనూనెలు, శీతలపానీయాలు తదితర తయారీ రంగ ఆహారోత్పత్తుల రేట్లు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. వంటనూనె ధర 33.59 శాతం పెరిగింది. కాగా, అంతకుముందు నెల జనవరిలో ఇది 2.31 శాతంగానే ఉన్నది. ఇక గత ఏడాది ఫిబ్రవరిలోనైతే 0.2 శాతమే.
వాణిజ్య లోటు 14.05 బిలియన్ డాలర్లు
దేశీయ ఎగుమతులు వరుసగా నాలుగో నెలా క్షీణించాయి. ఫిబ్రవరిలో 36.91 బిలియన్ డాలర్లే. దిగుమతులు 50.96 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు 14.05 బిలియన్ డాలర్లుగా ఉన్నది. పెట్రోలియం ధరల్లో ఒడుదొడుకులు, అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులే ఎగుమతుల క్షీణతకు కారణమని కేంద్రం చెప్తున్నది.