ఆరోగ్యంగా ఉండాలని ఆహారం, వ్యాయామం గురించి ఎక్కువగా ఆలోచించేవాళ్లు ఈ చిన్న ప్రయత్నం చేయండి. కొద్ది సమయంలోనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం యాభై సార్లు జంపింగ్ చేశారంటే కండరాలు, ఎముకలు బలంగా తయారవుతాయి. కాళ్లు, తుంటిలో ఉండే ఎముకలు, కండరాల్లో కదలిక, ఒత్తిడి కలుగుతుంది.
అందువల్ల వాటిలో రక్తప్రసరణ పెరిగి, బలంగా తయారవుతాయి. జంపింగ్ చేస్తున్న సందర్భంలో గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల గుండె కవాటాల్లోని కండరాలు బలపడతాయి. దాంతో గుండె పనితీరు మెరుగుపడుతుంది. అలాగే రక్త ప్రసరణ వ్యవస్థ కూడా బాగవుతుంది.
జంపింగ్ వల్ల ఫీల్‌గుడ్ హార్మోన్ అయిన ఎండార్ఫిన్ విడుదలవుతుంది. ఇది మిమ్మల్ని రోజంతా ఉల్లాసంగా ఉంచుతుంది. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేందుకు జంపింగ్ చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. కీళ్ల సమస్యలు, ఆర్థరైటిస్, గుండె జబ్బులు ఉన్నవాళ్లు వైద్యుల సలహాతోనే ఈ ప్రయత్నం చేయాలని మరవకండి.