వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆయన ప్రయాణించే విమానం వాషింగ్టన్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు తిరిగి వచ్చేసింది. స్విట్జర్లాండ్‌లోని దావస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ మీటింగ్‌కు ఆయన వెళ్లేందుకు ఎయిర్‌ఫోర్స్ విమానంలో బయలుదేరారు. అయితే టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాల తర్వాత ట్రంప్ ప్రయాణిస్తున్న ఎయిర్‌ఫోర్స్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ విమానంలో స్వల్ప స్థాయి ఎలక్ట్రిక్ సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది.
సాంకేతిక సమస్య నేపథ్యంలో విమానాన్ని వెనక్కి తీసుకురావాలని నిర్ణయించినట్లు వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివియెట్ తెలిపారు. దేశాధ్యక్షుడి ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో విమానాన్ని వెనక్కి రప్పించినట్లు తెలిపారు. అయితే దావోస్ పర్యటన కోసం ట్రంప్ మరో ఎయిర్‌ఫోర్స్ విమానంలో వెళ్లనున్నారు. ఎయిర్‌ఫోర్స్ వన్ లో భాగంగా దేశాధ్యక్షుడి ప్రయాణాల కోసం గత నాలుగు దశాబ్ధాల నుంచి నాలుగు విమానాలను వాడుతున్నారు. బోయింగ్ కంపెనీ ఆ విమానాలను మెయిన్టేన్ చేస్తున్నది.
ఇటీవల ఆ విమానాల్లో చాలా మార్పులు చేశారు. రేడియేషన్ షీల్డింగ్, యాంటీ మిస్సైల్ టెక్నాలజీని ఆ విమానాలకు జోడించారు. మిలిటరీతో టచ్‌లో ఉండేందుకు, ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చేందుకు అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా ఎయిర్‌ఫోర్స్ విమానంలో ఏర్పాటు చేశారు. ఖతార్‌కు చెందిన రాజ కుటుంబం ట్రంప్‌కు ఇటీవల బోయింగ్ 747-8 జంబో విమానాన్ని గిఫ్ట్‌గా ఇచ్చిన విషయం తెలిసిందే. దాన్ని ఎయిర్‌ఫోర్స్ వన్ ఫ్లీట్‌లో జోడించాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్లేన్కు మార్పులు చేస్తున్నారు.