వికారాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): స్పీకర్ హోదాలో ఉండి రెండేండ్లలో వికారాబాద్‌కు చేసిందేమీ లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత, వికారాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జి సిరికొండ మధుసూదనాచారి ఆరోపించారు. స్పీకర్‌ను గెలిపించడమే వికారాబాద్ ప్రజలకు శాపంగా మారిందని అన్నారు. బుధవారం వికారాబాద్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్‌తో కలిసి సిరికొండ మీడియాతో మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ మున్సిపాలిటీలో కనీసం రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయలేకపోయిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరం గా విఫలమైందని అన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పి, పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ఏ మేరకు టికెట్లు కేటాయించారని ప్రశ్నించారు. బీసీలకు ఏడాదికి రూ.20 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీనిచ్చి, ఐదేండ్లలో లక్ష కోట్లు కేటాయించాల్సి ఉన్నా ఇప్పటివరకు ఎంత కేటాయించారో బీసీలకు తెలుసన్నారు. ఏం చేయని కాంగ్రెస్‌కు బీసీలు ఎందుకు ఓటేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని, రైతులకు యూరియా కూడా సకాలంలో అందించకపోవడంతో ఇబ్బందులు పడ్డారని తెలిపారు.
ఇన్ని దుర్మార్గాలకు ఒడిగట్టిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓటేస్తే ఇచ్చే అరకొర పథకాలను కూడా నిలిపివేస్తారని చెప్పారు. కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించినా ఏ వర్గానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని విమర్శించారు. ప్రజలు చైతన్యవంతులని.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలను సూచించారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ తదితరులు పాల్గొన్నారు.