కొత్తదనం ఉన్న కంటెంట్‌ను ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తే తప్పకుండా విజయాలు వరిస్తాయని, నిర్మాత కూడా సినిమా నిర్మాణం విషయంలో చక్కటి ప్రణాళికతో ఉండాలని అన్నారు నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’ ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకురానుంది. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రానికి వినయ్ రత్నం దర్శకుడు. ఈ సందర్భంగా బుధవారం నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడారు.
స్ఫూర్తివంతమైన కథతో ఈ చిత్రాన్ని తీశామని, ఎక్కడా ఫైట్స్ లేకుండా ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్గా మెప్పిస్తుందని తెలిపారు. మారేడుమిల్లి వంటి సుందరమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపామని, విజువల్స్ అబ్బురపరుస్తాయన్నారు. ఇటీవల వేసిన సెలబ్రిటీ షోకు మంచి స్పందన లభించిందని, అందరూ సినిమా బాగుందని ప్రశంసించారన్నారు. మట్టిలో మాణిక్యం లాంటి కథ ఇదని, గ్రామీణ నేపథ్యంలో వాస్తవికత, సహజత్వం ప్రధానంగా ప్రేక్షకుల హృదయాల్ని కదిలిస్తుందని తెలిపారు.