Metabolism | బరువు, ఆరోగ్యం, శారీరక దారుఢ్యం గురించి మాట్లాడేటప్పుడు మెటబాలిజం లేదా జీవక్రియ అనే పదం తరచూ వినిపిస్తుంది. మనం తీసుకునే ఆహారంలోని పోషకాలను శరీరం శక్తిగా మార్చుకుని, అవసరమైన శారీరక కార్యకలాపాలకు ఉపయోగించుకునే ప్రక్రియనే జీవక్రియ. వయసు, లింగం, శరీరంలో కండరాలు-కొవ్వు నిష్పత్తి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ, హార్మోన్ల పనితీరు వంటి అనేక అంశాలు జీవక్రియను ప్రభావితం చేస్తాయి. పోషకాహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం వంటివి జీవక్రియ సక్రమంగా పనిచేయడానికి సహాయపడతాయి.
అయితే కొన్ని కారణాల వల్ల జీవక్రియ మందగించినప్పుడు శరీరం కొన్ని సంకేతాలను చూపించదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు . బరువు పెరగడానికి ముందే శరీరం కొన్ని హెచ్చరిక సంకేతాలను అందిస్తుందని వారు పేర్కొంటున్నారు. ఉదయం నిద్రలేచిన వెంటనే అలసటగా అనిపించడం, మెదడు మందగించినట్లు లేదా ఆలోచనలు స్పష్టంగా లేకపోవడం, రోజంతా చురుకుగా ఉండడానికి పలుమార్లు కాఫీ అవసరమవడం వంటి లక్షణాలను గమనిస్తూ ఉండాలి. అలాగే తరచూ మలబద్ధకం ఉండడం, ఇతరులతో పోలిస్తే ఎక్కువగా చలిగా అనిపించడం, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, సాధారణంగా జీవితం పట్ల ఉత్సాహం లేదా సంతోషం తగ్గినట్లు అనిపించడం వంటి మార్పులు కూడా కనిపిస్తాయని వారు తెలిపారు.
ఈ సంకేతాలను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా సమస్యకు కారణమేమిటో తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. జీవక్రియలో సమస్యలు ఏర్పడడం నిజమైన పరిస్థితేనని, సరైన ఆహారం, అవసరమైన పోషక మద్దతుతో దాన్ని నియంత్రించవచ్చని వారు తెలియజేస్తున్నారు. అయితే ఈ లక్షణాలు కనిపించినంత మాత్రాన జీవక్రియ మందగించిందని నిర్ధారించలేమని గమనించాలి. శరీరంలో ఇలాంటి మార్పులకు ఇతర కారణాలు కూడా ఉండే అవకాశం ఉంది. అందువల్ల లక్షణాలు నిరంతరం కొనసాగితే వాటిని నిర్లక్ష్యం చేయకుండా తగిన వైద్య సలహా తీసుకోవడం అవసరం.
జీవక్రియకు సంబంధించిన మార్పులు ఎప్పుడూ బరువు పెరగడం రూపంలోనే కనిపించాల్సిన అవసరం లేదని పోషకాహార నిపుణులు పేర్కొన్నారు. ఉదయం లేవగానే అలసట, తరచూ మలబద్ధకం, చలి, పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం వంటి మార్పులను సాధారణ సమస్యలుగా భావించి పక్కన పెట్టకుండా శరీరం అందించే సంకేతాలుగా గమనించాలని సూచించారు. ఈ మార్పులను ముందుగానే గుర్తించి ఆహారం, నిద్ర, శారీరక చురుకుదనం వంటి జీవనశైలి అంశాలపై శ్రద్ధ పెట్టడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగ్గా చూసుకునే అవకాశం ఉంటుందని వారు తెలియజేస్తున్నారు.