కట్టంగూర్, సెప్టెంబర్ 04 : అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద కుటుంబాల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డులతో రాష్ట్రంలో ఎక్కడైనా సన్నబియ్యం పొందే అవకాశం కల్పించామని పేర్కొన్నారు.
ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆహార భద్రతతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ పుష్పలత, సివిల్ సప్లయ్ డిటి రాచకొండ జ్యోతి, సర్పంచులు ముక్కామల శ్యామల, కుంభం అనిల్ రెడ్డి, కొలిపాక సురేందర్ గౌడ్, మాద మమత, కొవ్వాకుల రాంబాబు, తోటకూరి జలజ, గుల్లి నరేష్, కురిమిళ్ల మల్లేష్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ పూజర్ల శంభయ్య, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.