సకల జనుల సంక్షేమం.. ప్రగతి పథమే లక్ష్యం.. పల్లెలు, పట్నాల సమగ్ర వికాసానికి తోడ్పడేలా.. అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ శాసనసభలో సోమవారం ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై వరాల జల్లు కురిపించడంపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు.. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పౌష్టికాహారలోపంతో గర్భిణులు, చిన్నారుల మరణాలను నివారించడానికి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయనున్నారు. ప్రతి గిరిజన గ్రామానికి రహదారి, పంచాయతీకి పక్కా భవనం ఏర్పాటు చేస్తుండడంపై అడవిబిడ్డలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం నుంచి చెన్నూర్ వరకు లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని మంత్రి ప్రకటించారు. ఏండ్ల తరబడి సొంతింటి కోసం ఎదురుచేస్తున్న వారికి సర్కారు తీపికబురు అందిందించి. సొంత జాగ ఉంటే ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షలు ఇస్తామని ప్రకటించడంతో తమ కల సాకారం అవుతుందని పేదలు సంతోషిస్తున్నారు. రైతులకు రూ.75 వేల రుణమాఫీ.. నేతన్నలకు బీమా పథకం.. విద్యార్థులకు హెల్త్ హైజెనిక్ కిట్లు.. 57 ఏండ్ల వారికి పింఛన్, భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిళ్ల పంపిణీ వంటి పథకాలను పొందుపర్చడంపై సబ్బండ వర్గాలు భళా బడ్జెట్ అని ప్రశంసిస్తున్నారు.
ఆదిలాబాద్, మార్చి 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రజలపై వివక్ష చూపుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తున్నది. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం 2022-23 బడ్జెట్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రవేశపెట్టింది. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సోమవారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వరాల జల్లు కురిపించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పౌష్టికాహార లోపంతో గర్భిణులు, చిన్నారుల మరణాలను నివారించడానికి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయనున్నారు. తండాలు, గూడేల్లో కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించనున్నారు. ప్రతి గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించనున్నారు. కుప్టి ప్రాజెక్టుకు టెండర్లు పిలువనున్నట్లు మంత్రి ప్రకటించారు. వీటితోపాటు సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు, రైతులకు రూ.75 వేల రుణ మాఫీ, నేతన్నలకు బీమాపథకం, విద్యార్థులకు హెల్త్ హైజెనిక్ కిట్లను అందించనున్నారు. 57 ఏండ్ల వారికి ఆసరా పింఛన్లు, భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిళ్ల పంపిణీ లాంటి ఎన్నో పథకాలను ప్రభుత్వం బడ్జెట్లో పొందుపర్చింది.
రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాలకు అనుకూలంగా ఉంది. ఎస్టీల సంక్షేమానికి రూ.12,565 కోట్లు కేటాయించడంతో గిరిజనులకు ప్రయోజనం చేకూరనుంది. ఆదిలాబాద్‌కు మెడికల్ కళాశాల ఉండగా, మంచిర్యాలలో వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు కొత్తగా వైద్యకళాశాల మంజూరుతో గిరిజనులు, పేదలకు సర్కారు వైద్యం చేరువకానుంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో రక్తహీనత కారణంగా గర్భిణులు మృతిచెందుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయనుంది. ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటుతో గుండె చికిత్సలు చేసుకునే అవకాశం ఏర్పడింది. బోథ్ నియోజకవర్గంలో నిర్మించే కుప్టి ప్రాజెక్టుకు టెండర్లు పిలువనుండగా కడెం ప్రాజెక్టుకు రిజర్వాయర్ సౌకర్యం కలుగనుంది. రూ.25 లక్షలతో కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన పంచాయతీలకు పక్కా భవానాలు నిర్మించనున్నారు. పేదవారి సొంతింటి కలను నెరవేర్చే విధంగా సొంత భూమి ఉన్న వారికి డబుల్ బెడ్రూంలను నిర్మించుకోవడానికి రూ.3 లక్షలు ఇస్తుండగా నియోజకవర్గంలో 3 వేల మందికి ప్రయోజనం చేకూరుతుంది. ప్రతి గిరిజన తండా, గూడేనికి రోడ్డు సౌకర్యం కల్పించనుండగా.. ఇందుకోసం రూ.1000 కోట్లు కేటాయించారు. 7 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు హెల్త్, హైజెనిక్ కిట్లను అందించడనుండగా.. వేలాది మంది విద్యార్థినులకు ప్రయోజం చేకూరుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారు.
దండేపల్లి, మార్చి7 : మా ఊరిలో నాకు మూడెకరాల పొలం ఉంది. నా భర్త రమేశ్‌తో కలిసి వ్యవసాయం చేస్త. బ్యాంకులో రూ.35 వేల వరకు అప్పు ఉంది. రాష్ట్ర సర్కారు బడ్జెట్లో రూ.50 లోపు రుణం ఉన్న వారికి మాఫీ చేస్తామని ప్రకటించడం ఆనందంగా ఉంది. తెలంగాణ సర్కారు ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుంది. రైతుబంధు, రైతుబీమా ఇస్తూనే రుణమాఫీ చేయడం గొప్ప విషయం. రైతుల క్షేమం కోసం పరితపించే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతులు ఎప్పుడూ అండగా ఉంటారు.
-ముత్తినేని సునిత, మహిళా రైతు, మాకులపేట
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఐదున్నరేళ్ల క్రితం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఇక్కడ వైద్య పరంగా అనేక వసతులు కల్పించింది. రూ. 7 కోట్లతో సీహెచ్‌సీని ఏర్పాటు చేసింది. రూ. 32 లక్షలతో డయాగ్నస్టిక్ సెంటర్‌ను కూడా ప్రారంభించింది. ఇటీవల రూ. 60 కోట్లతో ఏరియా దవాఖాన మంజూరు చేసింది. ఇప్పుడు ఆసిఫాబాద్‌లో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో ప్రకటించింది. జిల్లా ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందుకు సీఎం కేసీఆర్‌కు వారంతా రుణపడి ఉంటారు.
– కోవ లక్ష్మి, కుమ్రం భీం ఆసిఫాబాద్, జడ్పీ చైర్పర్సన్
గతంలో ఉన్న ప్రభుత్వాలు గిరిజన గ్రామాల అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో మా గ్రామాలను ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నాం. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవసరమైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పించింది. ఇప్పుడు గ్రామాలు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. పచ్చదనం పెరిగింది. సీజనల్ వ్యాధుల సమస్య లేకుండా పోయింది. నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందుతుంది. పంచాయతీలకు పక్కా భవనాలు లేకపోవడంతో ఖాళీగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర వాటిల్లో పంచాయతీ భవనాలు వాడుకుంటున్నాం. ప్రభుత్వం బడ్జెట్లో పంచాయతీ భవనాలకు నిధులు కేటాయించడం సంతోషకరం. రూ.25 లక్షలతో అన్ని వసతులతో కూడిన భవానాన్ని నిర్మించుకుంటాం.
– కైలాస్ కుడే, సర్పంచ్, హర్కాపూర్-అంద్‌గూడ, ఇంద్రవెల్లి మండలం
ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో గర్భిణులకు ప్రభుత్వం పంపిణీ చేయనున్న కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లతో ఎంతో ఉపయోగం ఉంటుంది. గిరిజన గ్రామాల్లో అనేకమంది గర్భిణులు రక్తహీనతతో బాధపడుతుంటారు. ప్రసవం సమయంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మహిళలు గర్భం దాల్చిన తర్వాత పౌష్టికాహారం అందిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సంతోషకరమైన విషయం.
– నరేందర్ రాథోడ్, జిల్లా వైద్యాధికారి, ఆదిలాబాద్
చెన్నూర్ రూరల్, మార్చి 7 : తెలం గాణ సర్కారు నేతన్నలకు నూలు, రసాయనాల మీద 50 శాతం సబ్సి డీ సదుపాయాన్ని కల్పించింది. రాష్ట్రం ఏర్పడగానే నేత కార్మికుల తో పాటు మరమగ్గాల కార్మికులకు చేతినిండా పనికల్పించింది. కేసీఆర్ సర్కారు నేతన్నలకు ఉపాధి లభించేవిధంగా కృషి చేస్తున్నది. రైతు బీమా మాదిరిగానే నేతన్నలకు కూడా రూ.5 లక్షల బీమా పథకాన్ని ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నదని అసెంబ్లీలో చెప్పడం ఆనందంగా ఉన్నది. ఇన్నేండ్లు ఏ ప్రభుత్వం కూడా మా గురించి పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– ఆవిడపు లస్మయ్య, నేత కార్మికుడు, పద్మనగర్, చెన్నూర్ మండలం
నా వయసు 58 ఏండ్లు. 57 ఏళ్ల వయ సున్న వాళ్లందరికీ ఆసరా పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. చెప్పిన ప్రకారం పింఛన్లు ఇచ్చేందుకు ఈ బడ్జెట్లో పైసలు విడుదల చేశారని అంటున్నారు. ఈ వయసులో కూడా కూలినాలి చేసుకుంటూ పొట్ట పోసుకోవాల్సి వస్తున్నది. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిలో కుటుంబ పోషణ భారంగా మారింది. వృద్ధులకు ఇచ్చే ఆసరా పెన్షన్ వయసును తగ్గించడం వల్ల మాలాంటి ఎందరికో లాభమైతుంది. వచ్చే నెల నుంచి పింఛన్ వస్తుందని అనుకుంటున్నా. పింఛన్ వస్తే కూలీకి వెళ్లే బాధలు తప్పుతాయి. – దాదారావ్, రాంనగర్, నిర్మల్
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 2022-23 రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగు నీరందించే ‘చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్’కు త్వరలో టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ శుభ సందర్భంగా చెన్నూర్ నియోజకవర్గంలోని గ్రామ, మండల, మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో కార్యకర్తలు, నాయకు లు, ప్రజలు సంబురాలు చేయాలి. పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుతూ వేడుకలు నిర్వహించాలి. చెన్నూర్ నియోజకవర్గ ప్రజలందరి తరపున సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేసి ధన్యవాదాలు తెలపాలి.
– బాల్క సుమన్,ప్రభుత్వ విప్
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ దేశంలోని మిగతా రాష్ర్టాలకు దిక్సూచిగా నిలుస్తుంది. ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసి.. 54 శాతం నిధులను కేటాయించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పేదల ఉపాధి మెరుగుపడింది. దళితబంధు, విద్య, వైద్యం, పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు, ఎస్టీ, బీసీల సంక్షేమం, రహదారుల నిర్మాణం, మెడికల్ కాలేజీల ఏర్పాటు లాంటివి ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి.
– జోగు రామన్న, ఎమ్మెల్యే, ఆదిలాబాద్
సిరికొండ, మార్చి 7 : ఎస్టీ నివాస ప్రాంతాలకు రోడ్డు నిర్మాణం కోసం ఎస్టీఎస్డీఎఫ్ నుంచి వెయ్యి కోట్ల రూపాయ లను ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. దీంతో తండా లు, గూడేలు ఆద్భుతమైన ప్రగతి సాధిస్తాయి. ప్రతి గిరిజన గ్రామానికీ రోడ్డు సౌకర్యం ఏర్పడితే అభివృద్ధిలో దూసుకపోతాయి. సరైన రోడ్డు సౌకర్యం లేక ఇన్నాళ్లు గర్భిణులు, బాలింతలు ఎన్నో ఇబ్బందులు పడుతుం డగా.. అవన్నీ తీరనున్నాయి. సీఎం కేసీఆర్ సార్.. సమ స్యను గుర్తించి ఎస్టీ ఎస్డీఎఫ్ నుంచి వెయ్యి కోట్లు మం జూరు చేయడం సంతోషంగా ఉంది. ఈ నిర్ణయంపై గిరిజనులమంతా సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– జాదవ్ బిక్కు, మాజీ సర్పంచ్, ధర్మసాగర్, సిరికొండ
మాది సోన్ మండలం సిద్ధుల కుంట గ్రామం. నేను, నా భార్య, ఇద్దరు పిల్లలు, తల్లితో పాటు మొత్తం ఐదుగురం కలిసి రేకుల షెడ్డులో ఉంటున్నాం. ఏడాది కింద అప్పుచేసి ఖాళీ జాగ కొన్న. అందులో రేకులు వేసుకున్న. వానకాలంలో ఈదురు గాలులకు రేకులు లేచిపోయాయి. పక్కా ఇల్లు లేక చాలా కష్టమైతున్నది. ఖాళీ జాగ ఉంటే ఇల్లు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షలు ఇస్తున్నదని తెలిసింది. డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం ఈ బడ్జెట్లో రూ.12వేల కోట్లు పెట్టిందంటున్నారు. దీనివల్ల మాలాంటి చాలా మంది పేదల సొంతింటి కల నెరవేరుతుంది. సొంత జాగా ఉన్నోళ్లకు డబుల్బెడ్రూం ఇంటి నిర్మాణం కోసం డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం మాలాంటి పేదలకు వరంలాంటిదే.
– అల్లంకొండ బుచ్చన్న, సిద్ధులకుంట గ్రామం
పేదల మంచీ చెడులు చూడడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారు దేవుడులాంటి వారు. ఇంత వరకు మా కార్మికులను ఎవరూ పట్టించుకోలేదు. ఇండ్లు కట్టడానికి రోజూ కూలీకి వెళ్తుంటా. ఒక్కరోజు పనిచేస్తే రూ.500 నుంచి రూ.800 వరకు వస్తాయి. అది కూడా పని ఉన్నప్పుడే. అలాంటి మాకు మోటర్ సైకిళ్లు ఇస్తామని బడ్జెట్లో చెప్పినట్లు తెలిసింది. ఇంతకంటే మాకు ఏం కావాలి. రోజూ ఇంటి నుంచి పని కాడికి పోయేందుకు ఆ బండి అవసరమైతది. ఎక్కువగా పని చేసుకొనే అవకాశం ఏర్పడుతది. దీనివల్ల మాకు కొంత ఆదాయం పెరుగుతది. రోజూ కూలి చేసుకునే మాలాంటి వారికి మోటర్‌సైకిళ్లను ఇస్తున్నారంటే కల లెక్క అనిపిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తలచుకుంటే ఏదైనా చేయగలరు అన్నది దీంతో స్పష్టమైంది.
– ఐలయ్య, భవన నిర్మాణ కార్మికుడు, నిర్మల్