ఖైరతాబాద్, సెప్టెంబర్ 29 : దివ్యాంగుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్ సరార్ను శాసనమండలిలో నిలదీస్తామని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు. సోషల్ జస్టిస్ పార్టీ దివ్యాంగ్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. గత ప్రభుత్వంలో దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేశామని, ప్రస్తుత ప్రభుత్వం కనీసం ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
పింఛన్లు పెంచుతామని మోసగించిన కాంగ్రెస్ సర్కార్‌పై తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో పింఛన్లు పెంచుతామని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజుగౌడ్, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, వీహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షుడు అందె రాంబాబు, సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షుడు చామకూర రాజు, కేవీ గౌడ్, బాలస్వామి, ఎంఎస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.