హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులను తక్కువ చేసి చూస్తే ఊరుకునేప్రసక్తే లేదని కాంగ్రెస్ సర్కార్‌ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో కార్పొరేషన్ మాజీ చైర్మన్ జీ దేవీప్రసాద్, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 10 నుంచి 15 లక్షల కుటుంబాల ఉద్యోగులు, పెన్షన్‌దారులు ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్త్ కార్డులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని మండిపడ్డారు. జూన్ 1 నుంచి హెల్త్ కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని ఇంతవరకు ఇవ్వకపోవడమేంటని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ సకాలంలో రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ ధోరణి ఇలాగే ఉంటే రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ జీ దేవీప్రసాద్ మాట్లాడుతూ హెల్త్ కార్డుల అంశంపై ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తున్నదని మండిపడ్డారు. హెల్త్ కార్డులపై ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నదని పేర్కొన్నారు. ఏ ఉద్యోగి హెల్త్ కార్డ్ స్కీమ్ పరిధిలోకి వస్తారో ప్రభుత్వానికే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో అంగన్వాడీ వర్కర్లకు ఏ రాష్ట్రంలో లేనివిధంగా జీతాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఔట్సోర్సింగ్ వ్యవస్థ తీసేసి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఎందుకు ఏర్పాటు చేయడంలేదని దేవీప్రసాద్ ప్రశ్నించారు.