ఠాకూర్ తిలక్ వర్మ, మహ్మద్ సిరాజ్.. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో హైదరాబాద్ కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్న ఆటగాళ్లు. ఇప్పుడు వీరి బాటలోనే మరో కుర్రాడు జాతీయ జట్టు వైపు దూసుకొస్తున్నాడు. హెచ్‌సీఏ లీగ్స్‌లో పరుగుల మోత మోగిస్తూ, వికెట్ల వేట కొనసాగిస్తూ.. దేశవాళీ జూనియర్ టోర్నీల్లో దుమ్మురేపాడు. అతనే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ వుట్కూరి యశ్వీర్ గౌడ్. అతని అద్భుత ప్రతిభను గుర్తించిన ఆలిండియా జూనియర్ సెలెక్షన్ కమిటీ భారత అండర్19 జట్టులోకి ఎంపిక చేసింది. వచ్చే నెల శ్రీలంకలో జరగబోయే వన్డే సిరీస్‌తో యశ్వీర్ తొలిసారి జాతీయ జూనియర్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. తెలంగాణ నుంచి మరో ఫ్యూచర్క్రికెట్స్టార్గా గుర్తింపు తెచ్చుకుంటున్న యశ్వీర్ ప్రయాణంపై ప్రత్యేక కథనం…
యశ్వీర్ స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట్ అయినప్పటికీ, వారి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. తండ్రి రాజ్కుమార్ఒక ఆర్కిటెక్ట్ కంపెనీలో పనిచేస్తున్నారు. యశ్వీర్ చిన్నప్పుడు క్రికెట్‌ను ఇష్టపడే తన బాబాయ్ దీపక్‌తో కలిసి గల్లీ క్రికెట్ ఆడేవాడు. అతనిలో ఆసక్తిని గమనించిన కుటుంబ సభ్యులు, నాలుగో తరగతిలోనే విద్యానగర్‌లోని డానియల్ క్రికెట్ అకాడమీలో చేర్పించారు. అక్కడ కోచ్ కమలేష్ వద్ద ఆటలో ఓనమాలు నేర్చుకున్న యశ్వీర్, ఓపెన్ ట్రయల్స్‌లో సత్తా చాటి హెచ్‌సీఏ లీగ్స్ ఆడేందుకు ఎంపికయ్యాడు. మరింత మెరుగైన శిక్షణ కోసం సైనిక్‌పురిలోని భవన్స్క్రికెట్అకాడమీలో చేరడం అతని కెరీర్లో కీలక మలుపు. అక్కడి కోచ్ కృష్ణ మోహన్ యశ్వీర్లోని ప్రతిభను పసిగట్టి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కృష్ణమోహన్ పర్యవేక్షణలోనే యశ్వీర్ అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. డానియల్ క్లబ్ నుంచి ఇంపీరియల్ క్రికెట్ క్లబ్‌కు ఆడే అవకాశం దక్కించుకున్న యశ్వీర్, హెచ్‌సీఏ వన్డే లీగ్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే అజేయంగా 184 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఆ ఇన్నింగ్స్ తర్వాత తను వెనుదిరిగి చూడలేదు.
లీగ్స్‌లో దుమ్మురేపిన యశ్వీర్టాలెంట్ను చూసి హైదరాబాద్ రంజీ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ ఆకర్షితుడయ్యాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిష్టాత్మక డెక్కన్ క్రానికల్ క్లబ్‌కు ఆడే అవకాశం ఇచ్చాడు. అక్కడ సీనియర్ ఆటగాళ్లతో కలిసి ఆడిన అనుభవం యశ్వీర్నైపుణ్యానికి మరింత పదును పెట్టింది. ఫలితంగా వరుసగా రెండు సీజన్లలో బీసీసీఐ కూచ్ బెహార్ ట్రోఫీ, వినూ మన్కడ్ అండర్19 వన్డే ట్రోఫీల్లో హైదరాబాద్‌కు ఎంపికయ్యాడు. 2024-25 సీజన్ కూచ్ బెహార్ ట్రోఫీలో కేవలం 5 మ్యాచ్‌ల్లోనే 21 వికెట్లతో సత్తా చాటాడు. ఈ ఏడాది అనారోగ్యం కారణంగా 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడినా.. ఏకంగా 302 పరుగులు చేసి, 12 వికెట్లు పడగొట్టాడు. రెండు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి తనలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నాడు.ఈ సీజ వినూ మన్కడ్ ట్రోఫీలో హైదరాబాద్ విజేతగా నిలవడంలో యశ్వీర్కీలక పాత్ర పోషించాడు. 8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టి, టోర్నీలోనే అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా, టాప్ స్పిన్నర్ నిలిచాడు. ముఖ్యం గా పంజాబ్‌తో జరిగిన ఫైనల్మ్యాచ్(3/22)లో మూడు కీలక వికెట్లు తీసి జట్టును చాంపియన్‌గా నిలిపాడు. ఇటీవల బీసీసీఐ సెంటర్ఆఫ్ఎక్స్లెన్స్లో నెల రోజుల పాటు జరిగిన ఆల్‌రౌండర్ల ప్రత్యేక క్యాంప్‌లో పాల్గొన్న యశ్వీర్కు అండర్-19 జట్టు నుంచి పిలుపువచ్చింది.
రెడ్ బాల్, వైట్‌బాల్.. ఫార్మాట్ ఏదైనా సత్తా చాటగల నైపుణ్యం యశ్వీర్సొంతం. విరాట్‌కోహ్లీ, రిషబ్‌పంత్, రవీంద్ర జడేజాను ఇష్టపడే యశ్వీర్.. కోహ్లీ, పంత్మాదిరిగా బ్యాటింగ్‌లో దూకుడుగా ఆడగలడు, జడేజా మాదిరి స్పిన్‌తో ప్రత్యర్థులను కట్టడి చేయగలడు. మైదానంలో ఎంత దూకుడుగా ఉన్నా, వ్యక్తిగతంగా మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాడు. ప్రస్తుతం సైనిక్‌పురిలోని భవన్స్ వివేకానంద డిగ్రీ కాలేజీలో బీకామ్ సెకండియర్ చదువుతున్న యశ్వీర్, రంజీ ట్రోఫీలో రాణించడంతో పాటు భవిష్యత్తులో భారత సీనియర్జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. శ్రీలంక పర్యటనలో లభించిన ఈ సువర్ణ అవకాశాన్ని యశ్వీర్ పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆశిద్దాం.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అండర్19 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాను. ఆ బాధ నుంచి బయటపడటానికి కొంత సమయం పట్టింది. కానీ, నేను ఇంకా కష్టపడాలని గ్రహించి, నెట్స్‌లో మరింత శ్రమించాను. ఇప్పుడు శ్రీలంక పర్యటనకు ఎంపికవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పటికైనా టీమిండియాకు ఆడాలన్నదే నా లక్ష్యం.
-యశ్వీర్ గౌడ్