హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) ఆరోపించారు. ఉద్యోగులకు తక్కువ చేసి చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి .దేవీప్రసాద్, టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రభుత్వ మొండి వైఖరి వల్ల తెలంగాణలో 10 నుంచి 15 లక్షల కుటుంబాల ఉద్యోగులు( Employees ) , పెన్షన్ దారులు ( Pensioners ) ఆందోళనలో ఉన్నారని ఆరోపించారు. హెల్త్ కార్డ్స్ ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుందని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర యేండ్లలో ఇంతవరకు ఉద్యోగులకు, పెన్షన్ దారులకు హెల్త్ కార్డ్స్ ఇవ్వలేదని ఆరోపించారు.
కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు రావడం లేదని అన్నారు.హెల్త్ కార్డ్స్ ఇష్యూపై కమిటీ వేశారే తప్పా హెల్త్ కార్డ్స్ మాత్రం ఇవ్వడం లేదని పేర్కొన్నారు.కమిటీ ముఖ్యమంత్రి మాట వినడం లేదా? ముఖ్యమంత్రి మాట కమిటీ వినడం లేదా అర్ధం కావడం లేదని విమర్శించారు. పీఆర్సీ 6 నెలల్లో క్లియర్ చేస్తామని చెప్పి ఇంతవరకు ఆ ఊసే లేదని అన్నారు.బీఆర్ఎస్ హయంలో ఉద్యోగులను కాపాడుకున్నామని వెల్లడించారు.
ఒక్కో ఉద్యోగి నుంచి నెలకు 2 వేల నుంచి 3 వేల వరకు డబ్బులు కట్ అవుతున్నాయి. ఉద్యోగి జీతం నుంచి డబ్బులు కట్ చేయమని ఈ ప్రభుత్వానికి చెప్పింది ఎవరని ప్రశ్నించారు. ఉద్యోగులను తక్కువ చేసి చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆరోగ్యం విషయంలో ఉద్యోగులు చనిపోతే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
జూన్ 1 నుంచి హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని విమర్శించారు.
కలిసొచ్చే ఉద్యోగ సంఘాలతో పోరాటం : మాజీ చైర్మన్ జి .దేవీప్రసాద్
హెల్త్ కార్డ్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తుందని దేవి ప్రసాద్ అన్నారు.
ఉద్యోగి సమ్మతి లేకుండా జీతం కట్ చేయవద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించుకోవడం లేదని తెలిపారు. కేసీఆర్ పరిపాలనలో అంగన్వాడీ వర్కర్స్ కు ఏ రాష్ట్రంలో లేని విధంగా జీతాలు ఇచ్చారని గుర్తు చేశారు.
,