ఇస్లామాబాద్: పాకిస్థాన్ అమ్ములపొదిలోకి కొత్త జలాంతర్గామి(Pakistan Submarine) వచ్చి చేరింది. హ్యాంగర్ క్లాస్ సబ్‌మెరైన్‌ను చైనాతో కలిసి ఆ దేశం సంయుక్తంగా నిర్మించింది. గురువారం కరాచీ పోర్టుకు ఆ సబ్‌మెరైన్ చేరుకున్నది. పాకిస్థాన్ నౌకాదళం ఆధునీకరణలో భాగంగా ఆ సబ్‌మెరైన్ వచ్చేసింది. పాకిస్థాన్ నేవీ డాక్‌యార్డ్‌కు చేరుకున్న సమయంలో రిసెప్షన్ సెర్మనీ నిర్వహించారు. కమాండర్ ఫ్లీట్ వైస్ అడ్మిరల్ అబ్దుల్ మునిబ్ చీఫ్ గెస్ట్‌గా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేవీ ఆఫీసర్లు, సిబ్బంది, కుటుంబసభ్యులు వెల్కమ్ కార్యక్రమంలో పాల్గొన్నట్లు పాకిస్థాన్ నేవీ ప్రకటన చేసింది.
పాకిస్థాన్ నేవల్ అకాడమీకి చెందిన క్యాడెట్లు సంప్రదాయ సెల్యూట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పీఎన్ జెడ్9ఈసీ హెలికాప్టర్లతో ఫ్లై పాస్ట్ చేపట్టారు. 2015లో కుదిరిన ఒప్పందం ప్రకారం .. చైనాలోనే హ్యాంగర్ క్లాస్ సబ్‌మెరైన్‌ను నిర్మించారు. మొత్తం 8 జలాంతర్గాములను పాకిస్థాన్‌కు అందించాలని గతంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. చైనాకు చెందిన సీఎస్ఐసీ కంపెనీ మొదటి నాలుగు సబ్మెరైన్లను నిర్మిస్తోంది. మిగితా నాలుగు సబ్మెరైన్ల నిర్మాణం, అసెంబ్లింగ్ పాకిస్థాన్‌లో జరుగుతోంది. ట్రాన్స్ఫర్ టెక్నాలజీ పద్ధతిలో కరాచీ షిప్‌యార్డులో వాటిని నిర్మించనున్నారు.
హ్యాంగర్ అనే పదాన్ని బెంగాలీ నుంచి తీసుకున్నారు. దీనికి షార్క్ అని అర్థం వస్తుంది. 1971 కన్నా ముందున్న పరిస్థితులను గౌరవిస్తూ ఆ పేరు పెట్టినట్లు తెలుస్తోంది. 1971 కన్నా ముందు బంగ్లాదేశ్ .. పాకిస్థాన్‌లో భాగంగా ఉండేది. వాస్తవానికి ఒరిజినల్ హ్యాంగర్‌ను ఫ్రెంచ్ నిర్మిత డఫేన్ క్లాస్ సబ్మెరైన్గా గుర్తిస్తారు. పాకిస్థాన్ నేవీలో ఆ తరహా అటాక్ సబ్మెరైన్లు ఉన్నాయి. అయితే ఆధునిక హ్యాంగర్ క్లాస్ జలాంతర్గాముల్లో చాలా అడ్వాన్స్ ఫీచర్లు ఉంటాయి. వీటికి స్టీల్త్ సామర్థ్యం కూడా ఉంటుంది.