కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సాంగ్వి గ్రామస్థులు ( Sangi Villagers ) , యువకులు బుధవారం తమ సమస్యల సాధనకు రోడ్డెక్కారు. ఆర్అండ్బీ ప్రధాన రహదారి నుంచి సాంగ్వి గ్రామానికి వెళ్లే రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సమస్యలను పరిష్కరించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలను బైకాట్ ( local elections Boycott ) చేస్తామని హెచ్చరించారు. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడిచినా తమ గ్రామానికి మొరం రోడ్డు తప్ప బీటీ రోడ్డు వేయ లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
రోడ్డుపై గుంతలు ఏర్పడి నడవలేని పరిస్థితులు, రోడ్డు గుండా ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేకపోవడం, స్మశాన వాటిక వెళ్లేందుకు దారి లేకపోవడం తదితర సమస్యలు గ్రామస్థులను పట్టి పీడిస్తున్నాయని పేర్కొన్నారు. పంట పొలాలకు వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. పారిశుద్ధ్య వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని వెల్లడించారు.
అధికారులకు విన్నవించినా స్పందన లేకపోవడం, ప్రజా ప్రతినిధులు సైతం ముఖం చాటేయంతో సమస్యలు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. సుమారు రెండున్నర గంటల పాటు ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడి అప్రోచ్ రోడ్డును తార్ రోడ్డుగా మార్చాలని, గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో శ్రీనివాస్, హనుమాండ్లు, యోగేష్, విజయ్, నాగన్, వంశీ, రాజు, విట్టల్, వెంకటేష్, గ్రామస్థులు, యువకులు పాల్గొన్నారు.