ఆదిలాబాద్ టౌన్/ ఎదులాపురం : సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy) పై కేసులు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ త్వరలో పోలీస్స్టేషన్ల ముట్టడికి బీఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి జోగు రామన్న ( Jogu Ramanna ) పిలుపునిచ్చారు. ఆదివారం సాత్నాల, జైనథ్, బోరజ్, బేలా మండలాల ముఖ్య నాయకులతో బీఆర్ఎస్ ( BRS ) కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయంతో సీఎం రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రైతులకు రూ.41 వేల కోట్ల రైతు బంధు ఇస్తామని హామీ ఇచ్చి కేవలం రూ. 22 వేల కోట్లు మాత్రమే ఇచ్చి మోసం చేశారని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ రూ.320 కోట్ల విలువగల భూములను కబ్జా చేశాడని కాంగ్రెస్ నాయకులు ఆరోపించినా కూడా స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
భూ కబ్జాలపై ఎస్పీ కేసులు నమోదు చేయడం మంచి పరిణామమైనా ఎమ్మెల్యే పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్కు రైతులు గుర్తొస్తున్నారే తప్ప, రైతు సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు సిద్ధంగా ఉండాలని కోరారు.