నీట్ పరీక్షా పత్రం పదే పదే లీక్ కావడంతో మొదలైన నిరసన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అసంతృప్తికి వేదికగా మారి దేశవ్యాప్తంగా యువత విద్యావిధానంలో వైఫల్యాలపై ఉద్యమించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుపట్టిన యువత చివరకు విజయం సాధించింది. మంత్రి రాజీనామాకు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఆయన స్థానంలో విద్యాశాఖను ఎవరికి అప్పగించారనే అంశాన్ని పట్టించుకోలేదు. మంత్రుల రాజీనామాలు యూపీఏలో ఉంటాయి, కానీ ఎన్డీయేలో కాదు అంటూ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో యువత డిమాండ్‌కు ప్రధాని మోదీ తలొగ్గారు. ప్రధాన్ స్థానంలో నియమించిన కొత్త విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని చూస్తే యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయంలా కనిపించడం లేదు. జోషి చదివింది సాధారణ బీఏనే. ప్రపంచానికి ఏఐ సవాల్ విసురుతున్న కాలంలో యువతను దీనికి అనుగుణంగా తీర్చిదిద్దడానికి విద్యావంతుడైన విద్యాశాఖ మంత్రి అవసరం ఎంతో ఉన్నది.
కృత్రిమ మేధ ప్రపంచాన్ని వణికిస్తున్నది. ప్రపంచాన్ని శాసిస్తున్న ఐటీ కంపెనీలు కూడా ఏఐ ప్రభావం ఎంతవరకు ఉంటుందో చెప్పలేక పోతున్నారు. ఎలాన్ మస్క్ లాంటి వారు ఏఐ ఒక్క ఐటీ ఉద్యోగాలనే కాదు, డాక్టర్లు, లాయర్ల వృత్తులను కూడా మింగేస్తుందని జోస్యం చెప్తున్నారు. భారతీయ యువతకు ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయంటే అది ఐటీ రంగంతోనే. ఏఐ ఐటీ రంగాన్ని మింగేస్తే మొదట బలయ్యేది భారతీయ యువతనే. ఈ నేపథ్యంలో ఏఐ విసురుతున్న సవాళ్లకు యువతను సన్నద్ధం చేసే విద్యావిధానం ఉండాలి.
మన దేశ యువతకు భవిష్యత్తులో ఏఐ, సెమీ కండక్టర్లు, డాటా సైన్స్, రోబోటిక్స్, పరిశోధన వంటి రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి . ఇవన్నీ విద్యావిధానంతో ముడిపడి ఉన్నాయి. మన యువతను 2030-40లో లభించే ఉద్యోగాలకు సిద్ధం చేస్తున్నామా? ఆ మేరకు మన విద్యావ్యవస్థలో సంస్కరణలు
చేపడుతున్నామా? లేదా? అనేది మన దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నాస్కామ్ నివేదిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం నాటికి మన దేశ టెక్నాలజీ రంగంలో ప్రత్యక్షంగా 60 లక్షల ఉద్యోగాలకు చేరుకుంటాం. ఒక్క సంవత్సరంలోనే 1.35 లక్షల ఉద్యోగాలు పెరుగుతాయని అంచనా.
రాజీవ్ గాంధీ ఆధునిక విద్యను అభ్యసించిన వ్యక్తి కావడంతో తన పాలనా కాలంలో సాంకేతిక విప్లవానికి ప్రాధాన్యం ఇచ్చారు. అంతకుముందు ల్యాండ్ లైన్ ఫోన్ కనెక్షన్ కావాలంటే ఏడేండ్ల్ల పాటు నిరీక్షించాల్సి వచ్చేది. మన్మోహన్ సింగ్ ఆర్థిక రంగంలో నిపుణుడు కావడంతో అయన హయాంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల దేశానికి మేలు జరిగింది. పీవీ నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు బంగారం విదేశాలకు తాకట్టు పెట్టిన స్థితిలో ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశాన్ని గట్టెక్కించారు. ఆయన హయాంలో తీసుకున్న నిర్ణయం వల్లనే ఐటీ రంగంలో లక్షల మందికి ఉపాధి లభిస్తున్నది. పాలకులు ఉన్నత విద్యావంతులైనపుడు ఆ ప్రభావం విధానాల మీద, దేశం మీద ఉంటుంది.
పాఠ్యపుస్తకాల్లో బాబర్ గురించి ఉండాలా? వద్దా? అనే చర్చలు రాజకీయ ప్రయోజనాన్ని కలిగించవచ్చు. కానీ దేశానికి ప్రయోజనం లేదు. యువతలో పెల్లుబికిన అసంతృప్తి కేవలం నీట్ లీకేజ్ మీద మాత్రమే కాదు. పెరుగుతున్న నిరుద్యోగం, తగ్గుతున్న ఉపాధి అవకాశాల మీద నెలకొన్నది. మన దేశంలో రాజకీయాల్లో, ఎన్నికల్లో మతం, కులం, ప్రాంతం, సెంటిమెంట్ ప్రధాన పాత్ర వహిస్తున్నది. జంతర్ మంతర్‌లో జెన్-జీ ఈ చర్చలను కాదని, విద్యావిధానం మీదకు మళ్లేటట్టు చేసి, సక్సెస్ అయ్యారు. జెన్ జీని చూసి వివిధ రాష్ర్టాల్లో విద్యార్థులు తమ పాఠశాలల్లో టీచర్లు లేరని, మరుగుదొడ్లు, మంచినీరు, కనీస సౌకర్యాలు లేవని ఆందోళన చేసి వీటిని సాధించుకుంటున్నారు. రాజకీయ నాయకత్వం సైతం సంప్రదాయ మార్గాన్ని పక్కన పెట్టి దేశానికి మేలు చేకూర్చే దిశగా.. ముఖ్యంగా యువత కోసం సముచిత నిర్ణయాలు తీసుకోవాలి.
– బుద్దా మురళి