Sweet Potatoes | కూరగాయలు, ఆకుకూరలు సాధారణంగా మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. కానీ కొన్ని రకాల కూరగాయలు మాత్రం కొన్ని సీజన్లలోనే లభిస్తాయి. అలాంటి వాటిల్లో చిలగడదుంపలు కూడా ఒకటి. వీటినే కొన్ని ప్రాంతాల్లు కంద గడ్డలు అని కూడా పిలుస్తారు. ఇవి చలికాలంలో ఎక్కువగా మనకు అందుబాటులో ఉంటాయి. అయితే పేరుకు దుంపలే కానీ ఇతర దుంపల కన్నా ఇవి చాలా భిన్నంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇతర దుంపలతో పోలిస్తే పోషకాల శాతం వీటిల్లో ఎక్కువగా ఉంటుంది. కనుక ఇతర దుంపల కన్నా ఇవి మనకు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఈ సీజన్లో లభించే చిలగడదుంపలను తరచూ తింటుంటే అనేక పోషకాలు లభిస్తాయి. ఈ దుంపలను తినడం వల్ల మనం అనేక విధాలుగా లాభాలు పొందవచ్చు.
చిలగడదుంపల్లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ల జాబితాకు చెందుతుంది. మన శరీరంలో ఇది విటమిన్ ఎ గా మార్పు చెందుతుంది. దీని వల్ల కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. విటమిన్ ఎ వల్ల కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. కంటి చూపు పెరుగుతుంది. వయస్సు మీద పడడం వల్ల కళ్లలో వచ్చే శుక్లాలు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ దుంపలను తినడం వల్ల శరీర భాగాల్లో వచ్చే మంటలను తగ్గించుకోవచ్చు. వీటిని తింటే విటమిన్ సి అధికంగా లభిస్తుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. దీని వల్ల సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గిపోతాయి.
చిలగడదుంపలను తినడం వల్ల శరీరంలో ఉండే కఫం కరిగిపోతుంది. గొంతు, ఊపిరితిత్తులు, శ్వాసనాళాల్లో ఉండే కఫం కరిగిపోతుంది. గాలి సరిగ్గా లభిస్తుంది. ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారికి మేలు జరుగుతుంది. ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం పొందవచ్చు. బ్రాంకైటిస్ ఉన్నవారు ఈ దుంపలను తింటుంటే ఉపయోగం ఉంటుంది. వీటిల్లో విటమిన్ సి, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి బ్రాంకైటిస్ నుంచి ఉపశమనం లభించేలా చేస్తాయి. ఈ దుంపల్లో అధికంగా ఉండే బీటా కెరోటిన్, మెగ్నిషియం, బి విటమిన్లు కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయం చేస్తాయి. దీని వల్ల ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది.
ఈ దుంపల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్తి ఉండదు. అలాగే గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఫైబర్ కారణంగా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అధిక బరువు తగ్గాలని చూస్తున్న వారు చిలగడదుంపలను రోజూ తింటుంటే ఫలితం ఉంటుంది. ఇక దుంపలు అయినప్పటికీ వీటిని తింటే షుగర్ లెవల్స్ ఏమాత్రం పెరగవు. పైగా వీటిల్లో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్ తగ్గేందుకు సహాయం చేస్తాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు సైతం నిరభ్యంతరంగా ఈ దుంపలను తినవచ్చు. ఇలా ఈ దుంపలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.