Peanut Butter | మార్కెట్లో మనకు అనేక రకాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. చాలా రకాల ఆహారాలు మనకు ప్రకృతి సహజసిద్ధంగా అందిస్తుంది. కొన్ని రకాల ఆహారాలను మనం తయారు చేసుకుని తింటాం. వాటిల్లో ఆరోగ్యకరమైనవి, అనారోగ్యకరమైనవి కూడా ఉంటాయి. అయితే ఆరోగ్యకరమైన ఆహారాల విషయానికి వస్తే వాటిల్లో పీనట్ బటర్ కూడా ఒకటి. పల్లీల నుంచి దీన్ని తయారు చేస్తారు. సాధారణంగా చాలా మంది దీన్ని అనారోగ్యకరమైన ఆహారం అని భావిస్తారు. ఎందుకంటే ఇందులో కొవ్వులు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి కనుక దీన్ని తినకూడదని, ప్రమాదమని అనుకుంటారు. కానీ ఇందులో నిజం లేదు. ఎందుకంటే పీనట్ బటర్ వాస్తవానికి ఆరోగ్యకరమైనదే. కానీ ఇందులో చక్కెరలు, అనారోగ్యకరమైన కొవ్వులు, ఉప్పు వంటి ఆహారాలను కలపకుండా తయారు చేసింది అయి ఉండాలి. అలాంటి పీనట్ బటర్‌నే మనం తినాల్సి ఉంటుంది. మార్కెట్లో చాలా రకాల పీనట్ బటర్ బ్రాండ్లు మనకు లభిస్తున్నాయి. కనుక వాటిని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
ఎలాంటి కృత్రిమ పదార్థాలు, చక్కెర, ఉప్పు లాంటి పదార్థాలను కలపకుండా తయారు చేసిన పీనట్ బటర్ అయితేనే మనం ఉపయోగించాలి. అలాంటి పీనట్ బటర్‌ను తింటేనే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పీనట్ బటర్ మనకు అనేక లాభాలను అందిస్తుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. మాంసాహారం తినని వారికి కావల్సిన ప్రోటీన్లను పీనట్ బటర్ అందిస్తుంది. ఇందులో వృక్ష సంబంధ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి కండరాల కణజాలానికి మరమ్మత్తులు చేస్తాయి. దీని వల్ల కండరాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. శరీరానికి శక్తి లభిస్తుంది. పీనట్ బటర్‌ను తింటే ఆరోగ్యకరమైన కొవ్వులను పొందవచ్చు. ఇందులో మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి మంచి కొవ్వుల జాబితాకు చెందుతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
పీనట్ బటర్లో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. దీని వల్ల క్యాన్సర్లు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. విటమిన్ ఇ వల్ల చర్మం సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పీనట్ బటర్ ను తింటే అధిక మొత్తంలో మెగ్నిషియం లభిస్తుంది. ఇది కండరాలను దృఢంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. నాడీ మండల వ్యవస్థ చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతుంది. దీంతో ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. బద్దకం పోతుంది. నీరసం, అలసట తగ్గుతాయి. పీనట్ బటర్లో అనేక రకాల బి విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ బి3 అధికంగా ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారం సులభంగా శక్తిగా మారేందుకు దోహదం చేస్తుంది. దీని వల్ల శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి.
పీనట్ బటర్లో అధికంగా ఉండే పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. శరీరంలో సోడియం స్థాయిలను తగ్గించి బీపీ అదుపులో ఉండేలా చేస్తుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది. పీనట్ బటర్‌ను తింటే జింక్ కూడా అధిక మొత్తంలో లభిస్తుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. దీని వల్ల సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ఈ విధంగా పీనట్ బటర్ మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే మార్కెట్లో ఏ పీనట్ బటర్ పడితే దాన్ని కొనకూడదు. కృత్రిమ పదార్థాలు లేని పీనట్ బటర్‌ను కొని వాడితే మేలు జరుగుతుంది. ఇక దీన్ని రోజుకు 2 టేబుల్ స్పూన్లకు మించి తినకూడదు. అలర్జీలు ఉన్నవారు పీనట్ బటర్‌ను తినకూడదు. ఇలా జాగ్రత్తలను పాటిస్తూ దీన్ని తింటుంటే అనేక లాభాలను పొందవచ్చు.