Asthma | చలికాలంలో లేదా ఇతర సమయాల్లో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చాలా మందికి శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి సమస్యల బారిన పడుతుంటారు. అయితే ఇవి సహజంగా వచ్చేవే. కానీ ఆస్తమా ఉన్న వారికి మాత్రం సీజన్లు మారినప్పుడు లేదా చల్లని వాతావరణం ఉన్నప్పుడు తీవ్రంగా ఇబ్బంది కలుగుతుంది. ఆస్తమాతో అల్లాడిపోతారు. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. అయితే ఆస్తమా ఉన్నవారు డాక్టర్ ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. అలాగే ఆహారం విషయంలోనూ అనేక జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. అయితే ఆస్తమా ఉన్నవారు పలు ఇంటి చిట్కాలను పాటించడం వల్ల సమస్య నుంచి ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. అలాగే శ్వాస నాళాలు క్లియర్‌గా మారుతాయి. ఊపిరి సరిగ్గా పీల్చుకోగలుగుతారు.
ఆస్తమా ఉన్నవారికి పసుపు ఎంతో మేలు చేస్తుంది. పసుపులో కర్క్యుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఆస్తమా నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అందుకుగాను రోజూ రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపును కలుపుకుని తాగాలి. ఇలా రోజూ చేయాలి. దీని వల్ల ఆస్తమా లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఆహారం విషయానికి వస్తే ఫ్లేవనాయిడ్స్, విటమిన్లు సి, డి, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీని వల్ల కూడా ఆస్తమా ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఈ ఆహారాల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల వీటిని తీసుకుంటే శ్వాస నాళాల వాపులు తగ్గిపోతాయి. దీని వల్ల శ్వాస నాళాలు క్లియర్‌గా మారి ఊపిరి సరిగ్గా తీసుకోగలుగుతారు. ఇందుకు గాను నారింజ, నిమ్మ, కివీ, ఆలుగడ్డలు, పాలు, చేపలు, గుడ్లు, లివర్, జున్ను, తృణ ధాన్యాలు, సిట్రస్ పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది.
ఆస్తమా ఉన్నవారు టీ, కాఫీలను తరచూ తాగుతుండాలి. చక్కెర లేకుండా బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. వీటిల్లో అధికంగా ఉండే కెఫీన్ ఆస్తమా లక్షణాల నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది. అలాగే శ్వాసనాళాలపై పడే ఒత్తిడి తగ్గిపోతుంది. దీంతో శ్వాస నాళాల వాపులు తగ్గిపోతాయి. అయితే కెఫీన్‌ను మరీ అధికంగా తీసుకోకూడదు. రోజుకు 3 లేదా కప్పుల టీ లేదా కాఫీ తాగాలి. అంతకు మించి తాగకూడదు. ఇక ఆస్తమాను తగ్గించుకునేందుకు అల్లం కూడా బాగానే పనిచేస్తుంది. ఇది గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫాన్ని తొలగిస్తుంది. శ్వాస నాళాలను వెడల్పుగా చేస్తుంది. దీని వల్ల శ్వాస సరిగ్గా లభిస్తుంది. ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. అల్లం రసాన్ని రోజూ రెండు పూటలా పూటకు ఒక టీస్పూన్ మోతాదులో తాగుతుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది.
యూకలిప్టస్ ఆయిల్‌ను వాడుతున్నా కూడా ఆస్తమా లక్షణాలను తగ్గించుకోవచ్చు. ఇది దీర్ఘకాలిక మంటను తగ్గించడంలో సహాయం చేస్తుంది. శ్వాసనాళాల్లో ఉండే వాపులు తగ్గిపోతాయి. కఫం కరిగిపోతుంది. ఒక ఖర్చీఫ్ మీద కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్‌ను వేసి దాన్ని నిద్రించేటప్పుడు ముక్కుకు దగ్గరగా పెట్టుకోవాలి. లేదా మరుగుతున్న నీటిలో కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్‌ను వేసి అనంతరం వచ్చే ఆవిరిని బాగా పీల్చాలి. ఇలా చేస్తున్నా కూడా ఉపశమనం లభిస్తుంది. శ్వాస నాళాలు క్లియర్‌గా మారుతాయి. గాలి సరిగ్గా లభిస్తుంది. ఈ విధంగా పలు ఆహారాలను తీసుకుంటూ ఆయా చిట్కాలను పాటిస్తుంటే ఆస్తమా లక్షణాలను చాలా వరకు తగ్గించుకుని ఉపశమనం పొందవచ్చు.