హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ఇల్లు కట్టి చూడు.. పెండ్లి చేసి చూడు అన్నది ఓ నానుడి! కానీ కాంగ్రెస్ సర్కార్‌లో మాత్రం కట్టిన ఇల్లు ఉన్నా దాన్ని అమ్మి కనీసం పెండ్లి కూడా చేయలేని దుస్థితి దాపురించింది. ఈ చేదు అనుభవం హైదరాబాద్ శివారు ఉప్పల్‌కు చెందిన 70 ఏండ్ల వృద్ధురాలు ప్రభావతికి ఎదురైంది. తన కష్టార్జితంతో 1995లో ఉప్పల్‌లోని స్వరూప్‌నగర్ కాలనీలో ఆమె ఇల్లు కొనుక్కున్నది. విస్తీర్ణం 130 గజాలు. ఇటీవల బిడ్డకు పెండ్లి కుదిరింది. వైభవంగా పెండ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలని భావించి, ఇల్లు అమ్మేయాలని నిర్ణయించుకున్నది. ఓ కొనుగోలుదారు ముందుకు రావడంతో 45 రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుందామనే ఒప్పందంపై ఆమె అడ్వాన్స్ కూడా తీసుకున్నది.
ఈ మేరకు స్లాట్ బుక్ చేసకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. ముహూర్తం దగ్గరపడుతుండటంతో మిగతా డబ్బు వచ్చేస్తే పనులన్నీ సాఫీగా సాగుతాయని ఆనందంగా ఉన్న సమయంలో పిడుగులాంటి వార్త తెలిసింది. తాము ఇంటిని రిజిస్ట్రేషన్ చేయలేమని సబ్ రిజిస్ట్రార్ తేల్చిచెప్పారు. ఇంటి స్థలం నిషేధిత జాబితాలో ఉన్నదని, కలెక్టర్ ఎన్వోసీ ఉంటే తప్ప రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాదని చెప్పారు. ఆ మాటలు విని ప్రభావతి గుండె పగిలినంత పనైంది. ‘30 ఏండ్ల నుంచి ఉంటున్న సొంత ఇంటిని అమ్ముకోవాలంటే కలెక్టర్ అనుమతులు ఎందుకు కావాలి?’ అని ప్రశ్నించింది.
1995 నుంచి ఇప్పటివరకు రెండు డాక్యుమెంట్లు మారినప్పుడు అడ్డుచెప్పని అధికారులు ఇప్పుడెందుకు కాదంటున్నారని నిలదీసింది. ఈ వయసులో తనను ఎందుకు వేధిస్తున్నారంటూ తల్లడిల్లిపోయింది. అయినా తామేం చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. అప్పటి నుంచి ఆ వృద్ధురాలి శోకానికి అంతులేకుండా పోయింది. శ్రావణమాసంలో జరగాల్సిన బిడ్డ పెండ్లిని తలుచుకొని కన్నీరుమున్నీరవుతున్నది. 70 ఏండ్ల వయసులో ఆఫీసుల చుట్టూ ఎలా తిరగాలో అర్థం కావడంలేదంటూ నిస్సహాయత వ్యక్తంచేస్తున్నది. పైసా పైసా కూడబెట్టి కొనుక్కున్న ఇల్లును ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నానని, అలాంటి ఇంటిని బిడ్డ పెండ్లి కోసం అమ్ముదామనుకుంటే ప్రభుత్వం అడ్డుపడి, తమ జీవితాలను గందరగోళంలో పడేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నది.
ఇది ఒక్క్ర పభావతి సమస్యే కాదు. హైదరాబాద్ మహా నగరవ్యాప్తంగా వేలాది మంది ఎదుర్కొంటున్న అవస్థ. దశాబ్దాల కిందట కొనుగోలు చేసిన ఇండ్లు, ప్లాట్లను కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రికిరాత్రే నిషేధిత జాబితాలో పెట్టింది. వేలాది కుటుంబాలపై యూఎల్సీ పిడుగు వేసింది. తమ అవినీతితో శూన్యం నుంచి కూడా కాసులు రాబట్టగలమని నిరూపించింది. నిషేధిత జాబితా పేరిట పెద్ద ఎత్తున భూ దందాకు తెరలేపింది. దశాబ్దాల కిందటే వ్యవసాయేతర భూములుగా మారినవాటిని వ్యవసాయ భూముల కింద చూపుతూ ప్రజలను దోపిడీ చేసే కుట్రకు తెరలేపింది.
ఇప్పటికే హైడ్రా పేరిట పేదల ఇండ్లను కూలుస్తూ రోడ్డున పడేస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు ఏండ్లనాటి ఇండ్లు, ప్రైవేట్ స్థలాలు, వెంచర్లు, కాలనీలు, సొసైటీలను నిషేధిత జాబితాలో చేరుస్తూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఇదేమిటని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులను ప్రశ్నిస్తే తమకేమీ తెలియదని సమాధానమిస్తున్నారంటూ బాధితులు ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా అటు హైడ్రా, ఇటు 22ఏ జాబితాల ఫలితంగా గ్రేటర్ హైదరాబాద్‌లో ఇండ్లు, స్థలాలు కొనాలన్నా, అమ్మాలన్నా వీలుకాని పరిస్థితులు ఏర్పడ్డాయి.
22ఏ జాబితాను సాకుగా చూపిస్తూ అధికారులు, అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున భూ దందాకు తెరలేపినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అత్యవసరానికి ఆస్తులను విక్రయించేందుకు వెళ్తున్న వారికి ‘ప్రొహిబిటెడ్ జాబితాలో ఉంది. రిజిస్ట్రేషన్ కాదు’ అంటూ అధికారులు సమాధానం ఇస్తున్నారట! ఒక సర్వే నంబర్లోని ఒక సబ్ డివిజన్ నంబర్ వ్యవసాయ భూమిగా ఉండి, మిగతా భూమంతా వ్యవసాయేతర భూమిగా ఉన్నా, ఆ సర్వే నంబర్ మొత్తం 22ఏ జాబితాలో ఉన్నదంటూ బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అడిగినంత ఇస్తే ఏదో ఒక రకంగా రిజిస్ట్రేషన్ చేయిస్తామంటూ బేరసారాలు చేస్తున్నట్టు చెప్పుకొంటున్నారు. 22ఏ జాబితాకు, వ్యవసాయేతర భూములకు సంబంధం లేకపోయినా బాధితులను భయపెడుతూ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
నిషేధిత జాబితాలో ఉన్నవారు రెవెన్యూ అధికారుల నుంచి ఎన్వోసీ తీసుకురావాలని సబ్ రిజిస్ట్రార్ సిబ్బంది చెప్తున్నారు. దీంతో బాధితులు రెవెన్యూ కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎన్వోసీల జారీలో మాత్రం వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఎన్వోసీపై విచారణ జరిపి నివేదిక సమర్పించేందుకు తహసీల్దార్లు కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారుల చేతులు తడిపితేనే నివేదిక పై అధికారులకు చేరుతున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తహసీల్దార్ల నివేదిక ఆర్డీవో, డీఆర్వో, అదనపు కలెక్టర్, జిల్లా కలెక్టర్ వరకు వెళ్లి, ఆమోదం పొంది, తిరిగి వచ్చేసరికి నెలల సమయం పడుతున్నదంటూ వాపోతున్నారు. దిక్కుతోచని స్థితిలో న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వంపై కోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
ఉప్పల్ ప్రాంతంలోని సర్వే నంబర్ 60 నుంచి 65 వరకు దాదాపు 600 ఎకరాలకుపైగా భూములను కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చింది. మెరుపు దాడి చేసినట్టుగా వేలాది కుటుంబాలను చావు దెబ్బ కొట్టింది. అత్యవసరానికి ఆస్తులు అమ్ముకోవాలన్నా ‘నో ఆబ్జక్షన్’ సర్టిఫికెట్ కావాలని అడుగుతుండటంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఇన్నాళ్లూ తమ ఆస్తులే అని గుండెలమీద చెయ్యి వేసుకొని బతికామని, ఇప్పుడు ప్రభుత్వం కంటి మీద కునుకు లేకుండా చేసిందని మండిపడుతున్నారు.
ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అధికారయంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నదంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఉప్పల్ ఒక ఉదాహరణ మాత్రమే. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో గ్రామాలకు గ్రామాలే 22ఏ జాబితాలో చేర్చినట్టు అధికార వర్గాలే చెప్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. హైరైజ్డ్ భవనాలు, అపార్ట్మెంట్లలోని వేలాది ఫ్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చడంతో పైసా పైసా కూడబెట్టుకుని, బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని కొనుక్కున్న కలల సౌధం తమది కాకుండా పోతున్నదంటూ వేతన జీవులు కుంగిపోతున్నారు. అన్ని రకాల అనుమతులున్నా తమ ఆస్తులకు రక్షణ లేదంటూ మనోవేదనకు గురవుతున్నారు.