వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ( Promises ) అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( Minister Ponguleti Srinivas Reddy ) అన్నారు.
శనివారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, స్థానిక శాసన సభ్యులు తుది మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి ఇందిరమ్మ ఇళ్లను ( Indiramma Houses ) ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమాన్ని జోడేద్దుల వలె ముందుకు తీసుకువెళుతున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు ఎవరిది, ఏ స్థాయిలో ఉందో చూసి వెంటనే లబ్ధిదారుని ఖాతాలో ప్రతి సోమవారం డబ్బులు జమచేస్తున్నామని వెల్లడించారు.
రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ దేశానికి కాంగ్రెస్ శ్రీరామరక్ష అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వమని చెప్పారు.
రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్క నిరుపేద కుటుంబం స్వంత ఇల్లు లేదు అని బాధపడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామనీ చెప్పారు. రాష్ట్రంలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5.00 లక్షల చొప్పున రూ. 22,500 కోట్ల నిధులు మంజూరు చేశామని పేర్కొన్నారు.