నవాబుపేట : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఉన్న విద్యుత్ ( Electricity ) సమస్య కాంగ్రెస్ పాలనలో మళ్లీ చూస్తున్నామని వికారాబాద్ జిల్లా గంగ్యాడ గ్రామస్థులు ( Gangyada villagers ) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలుగా గ్రామంలో తీవ్రంగా ఉన్న విద్యుత్ సమస్యను తీర్చే నాథుడే లేక తమ బాధను ఎవరికి చెప్పుకోలేక సతమతమవుతున్నారు. సంబంధిత అధికారులు ఏఈ , లైన్మెన్కు వివరించినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపించారు.
ఇంటి పన్నులు, ఇతర బిల్లులు సకాంలో చెల్లిస్తున్నా కరెంట్ సరఫరాను మాత్రం తీర్చడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ కాలనీలో ఈ సమస్య మరింత జఠిలంగా ఉందని అధికారులకు చెప్పిన కూడా ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితి మరి దారుణంగా ఉందని విద్యుత్ సమస్యతో పంట సాగుకు రైతులు ముందుకు రావడం లేదని తెలిపారు. వేసవిలో రాత్రి, పగళ్లు కలిపి నాలుగు గంటలు కూడా కరెంటు సరఫరా కావడం లేదని అన్నారు.
సబ్ స్టేషన్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన కూడా ఫలించడం లేదని, పూల్లపల్లి, నరేగూడం, గంగ్యాడ గ్రామాలకు కలిపి సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని రైతులు, గ్రామస్థులు, చిరువ్యాపారులు పేర్కొన్నారు. మూడు గ్రామాలకు కలిపి ఒక సబ్ స్టేషన్‌ను నిర్మిస్తే విద్యుత్ సరఫరా సమస్య తీరుతుందని వెల్లడించారు. ఇటివల గ్రామంలో గ్రామదేవతల జాతర సమయంలో జనరేటర్‌తో జాతర ఉత్సవాలను నిర్వహించుకున్నామని అన్నారు. సెల్ఫోన్ల ఛార్జింగ్ పెట్టుకోవడానికి కరెంట్ లేకుండా పోతుందని వివరించారు.