ఖిల్లాఘణపురం, మార్చి 13: వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలో నిర్మిస్తున్న కర్నె తండా ఎత్తిపోతల పథకంతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ పనులు పూర్తయితే పదేండ్లు కరువు వచ్చినా సాగునీటికి ఢోకా ఉండదని చెప్పారు. ఆదివారం ఖిల్లాఘణపురం మండలంలో కర్నెతండా ఎత్తిపోతల పనులకు మంత్రి భూమిపూజ చేసి, పనులు ప్రారంభించారు. అనంతరం అక్కడే పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. కర్నెతండా ఎత్తిపోతల పనులను ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జిల్లా కేంద్రంలో ఈ లిఫ్ట్ పనులకు శంకుస్థాపన చేయగా.. ఆదివారం పనులు ప్రారంభించినట్టు పేర్కొన్నారు. రూ.76.19 కోట్లతో 150 రోజుల్లో పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టంచేశారు. ఈ పథకం ద్వారా 1,465 ఎకరాలకు సాగునీరందిస్తామని చెప్పారు. దీంతో 6 గ్రామాలతోపాటు 16 గిరిజన తండాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఈ లిఫ్ట్ కోసం దాదాపు 100 ఎకరాల భూమిని ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు.