నిజామాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘ఎల్ నినో ముంచుకొస్తున్నది. వర్షాలు తగ్గుతాయి. సాగునీటికి కొరత తప్పదు. కాబట్టి నీటి అవసరం ఎక్కువగా ఉండే పంటలకు దూరంగా ఉండండి’.. ఈ ఏడాది వానకాలం ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం పదేపదే చేసిన హెచ్చరికలివి. సీఎం రేవంత్‌రెడ్డి సైతం ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు రావొచ్చని, అందుకే పంట మార్పిడీని సూచిస్తున్నామని జూన్ 30న రైతు భరోసా విడుదల సందర్భంగా చెప్పారు. అయితే.. అప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. ముందస్తుగా అప్రమత్తం చేయడంలో సర్కార్ విఫలం కావడంతో రైతులు వరిసాగు మొదలు పెట్టారు. ఎకరాకు దాదాపు రూ.10 వేల వరకు పెట్టుబడి పెట్టి వానల కోసం ఎదురు చూశారు.
వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ప్రతిసారీ పంటసాగుతో నష్టపోతారని చెప్పిందే తప్ప.. ఎంత మంది, ఎంత మొత్తుకున్నా కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోసి నీళ్లివ్వాలని, పంటలను కాపాడాలనే ఆలోచన మాత్రం చేయలేదు. పైగా యూరియా పంపిణీకి కొత్త యాప్‌లు, కరెంటు కోతలతో మరింత భయపెట్టింది. దీంతో అనేక మంది నాట్లు వేయకుండానే సాగును మధ్యలో వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. సర్కార్ నిర్వాకం తెలంగాణలో సాగువిస్తీర్ణం తగ్గడంతో ఇప్పుడు వడ్లకు డిమాండ్ పెరిగింది. ఓవైపు కేంద్రం మద్ధతు ధర పెంచగా, మరోవైపు ప్రైవేట్ వ్యాపారులు సైతం ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. సర్కార్ నిర్లక్ష్యం కారణంగా తాము నష్టపోతున్నామని రాష్ట్ర రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
బియ్యం వ్యాపారులకు వానకాలమే కీలకం. ఇప్పుడే సన్నవడ్లు ఎక్కువగా కొనుగోలు చేసి పెట్టుకుంటారు. ఆ తర్వాత మర ఆడించి, సంచుల్లో నింపి రిటైల్‌గా విక్రయిస్తారు. ఎల్ నినో ప్రభావంతో సాగు విస్తీర్ణం భారీగా పడిపోయింది. యాసంగి కూడా ఇదే దుస్థితి కనిపిస్తుండటంతో, కొరతను ఊహించి ముందస్తుగానే ప్రైవేట్ వ్యాపారులు వడ్లు సేకరిస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సన్న వడ్లకు కనీవినీ ఎరుగని డిమాండ్ ఏర్పడింది.
పొలాల్లో హార్వెస్టర్‌తో కోసింది కోసినట్టే వడ్లు సేకరిస్తున్నారు. 30 శాతం తేమ ఉన్నా రూ.3 వేలకు పైగా ధర చెల్లిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ, తమిళనాడు కర్ణాటక వ్యాపారులు సన్న వడ్ల కోసం ఎగబడుతున్నారు. కరువు పరిస్థితుల కారణంగా ఆయా రాష్ర్టాల్లో డిమాండ్ విపరీతంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో కొన్నిచోట్ల క్వింటాకు రూ.3,200 వరకు ధర పలుకుతున్నది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం తాజాగా వరికి మద్దతు ధర పెంచింది. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తే.. రైతులు ఈసారి లాభాలను కండ్లచూసే అవకాశం ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకం కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు.
ఎల్ నినో లాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలబడేలా కాళేశ్వరం ప్రాజెక్టును గత కేసీఆర్ ప్రభుత్వం నిర్మించింది. ఎస్సారెస్పీ నిత్య జల స్రవంతిలా కనిపించేలా రివర్స్ పంపింగ్ వ్యవస్థకు పురుడు పోసింది. కాళేశ్వరం జలాలను వరద కాలువ ద్వారా ఎదురెక్కించి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నింపేలా తీర్చిదిద్దారు. మోటర్లు ఆన్ చేస్తే జలాలు తరలి వచ్చి ఎస్సారెస్పీలో ఎగిరి దుంకుతాయి. కానీ కేసీఆర్‌పై రాజకీయ కక్షతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం లక్షలాది మంది రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టింది. అక్టోబర్ 2 నాటికి ఎస్సారెస్పీలో 46.057 టీఎంసీల నీళ్లున్నాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్న నీళ్లతో కనీసం గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతలను కూడా నడిపించలేకపోతున్నారు.
నాకు పది ఎకరాల భూమి ఉంది. వరి సాగు చేశాను. దిగుబడి ఆశాజనకంగానే వచ్చింది. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను వేగంగా ఏర్పాటు చేయాలి. క్వింటాకు రూ.500 ఇస్తామని చెప్పిన బోనస్ ఇవ్వాలి. సర్కార్ నుంచి చేయూత లేకపోవడంతోనే దళారులను ఆశ్రయించాల్సి వచ్చింది. ప్రైవేట్ వాళ్లు క్వింటాకు రూ.3,150 ఇస్తున్నారు. ఈ ధర లాభసాటిగానే ఉన్నది.
– వైట్ల సూర్యనారాయణ, రైతు, జైతాపూర్, బోధన్ నియోజకవర్గం
ఎల్ నినో వంటి భయాలను దాటుకొని వరి ఉత్పత్తి చేశాం. ఎకరాకు 50 నుంచి 55 సంచులు దిగుబడి వస్తున్నది. ధర కూడా ఆశించిన దానికంటే ఎక్కువగానే వస్తున్నది. మాకు క్వింటాకు రూ.3,200 వరకు ధర పలికింది. పచ్చి వడ్లకు ఇంతగా ధర రావడం ఇదే మొదటిసారి.
– రామచందర్, రైతు, జైతాపూర్, బోధన్ నియోజకవర్గం