ఆటోమేటెడ్ మీటర్ రీడర్ల పేరిట వినియోగదారుడు దోపిడీకి గురవుతున్నాడు. వినియోగదారులకు నల్లా కనెక్షన్లు, బిల్లుల రూపంలో చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా బల్క్ కనెక్షన్ తీసుకున్న వారిని ముప్పు తిప్పలు పెడుతున్నారు. రూ. లక్షల్లో బిల్లులు వసూళ్లు చేస్తూ వినియోగదారుడితో ఆటలాడుకుంటున్నారు. జలమండలి అధికారులు, ఆటోమేటెడ్ మీటర్ రీడర్లను సరఫరా చేసే ఏజెన్సీలు కుమ్మక్కై వినియోదారుల సొమ్మును దోచుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
– సిటీబ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ)
జలమండలి అధికారులు వినియోగదారుడికి తెలియకుండానే నల్లా కనెక్షన్‌తో పాటు ఆటోమేటెడ్ మీటర్ రీడర్ల చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. కానీ జలమండలి లైసెన్స్ పొందిన ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం వినియోగాదారుడు అడగకపోతే ఆ మీటర్లను బిగించడం లేదు. కనెక్షన్ ఇచ్చిన కాంట్రాక్టర్ మీటర్ ఉంటేనే కనెక్షన్ పూర్తి చేస్తానని తేల్చి చెబుతుండటంతో తప్పని పరిస్థితుల్లో మెకానికల్ మీటర్ రీడర్లను బిగించుకుంటున్నారు. అటు ఆటోమేటెడ్ మీటర్ రీడర్లకు వేలాదిరూపాయలు చెల్లించి, మళ్లీ మెకానికల్ మీటర్ రీడర్లను ఏర్పాటు చేసుకుంటూ రెండు విధాలా నష్టపోతున్నారు. ఆటోమేటెడ్ మీటర్ రీడర్లు లేకపోవడంతో రిపేర్లు వచ్చినా పట్టించుకోవడం లేదు. దీంతో యావరేజీ బిల్లుల పేరిట లక్షలాది రూపాయలు వసూ లు చేస్తున్నారు. అధికారులు మాత్రం ఏజెన్సీలు మీటర్ రీడర్లను ఏర్పాటు చేయకున్నా టంఛన్‌గా వారికి వెళ్లాల్సిన బిల్లులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నారు. లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని జలమండలి అధికారులు, మీటర్ రీడర్ల ఏజెన్సీలు సంయుక్తంగా దోచుకుంటున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జలమండలి నల్లా కనెక్షన్ తీసుకున్న వినియోగదారులకు కనెక్షన్ స్థాయిని బట్టి బల్క్‌లో 40 ఎంఎం నుంచి 200 ఎంఎం పైపులైన్ లైన్ వేస్తారు. ఈబల్క్ కనెక్షన్లు తీసుకునేవారికి కనెక్షన్ ఫీజుతో పాటు ఆటోమేటెడ్ మీటర్ రీడర్ల చార్జీలు కూడా అందులోనే కలిపి వసూలు చేస్తారు. మీటర్‌కు ఐదేండ్ల వారెంటీ కూడా ఉంటుంది. ఈ ఐదేండ్ల పాటు మీటర్‌కు ఎలాంటి మరమ్మతులు వచ్చినా జలమండలిదే బాధ్యత ఉంటుంది. జలమండలి అధికారులు ఈ మీటర్ రీడర్ల సరఫరాకు కొన్ని ఏజెన్సీలను హైర్ చేసుకుని వారి ద్వారా సరఫరా చేస్తున్నారు. కానీ ఆ యా ఏజెన్సీల నిర్లక్ష్యం, అలసత్వంతో మీటర్లను బిగించడం లేదు. కొన్ని చోట్ల బిగించినా.. మరమ్మతులు చేయడానికి సంప్రదిస్తే స్పందించడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కనెక్షన్ తీసుకున్న వెంటనే మీటర్ బిగించాల్సి ఉంటుంది. లేదంటే క్యాన్ నెంబర్ రాదు. ఏజెన్సీలు స్పందించకపోవడం, జలమండలి అధికారులు పట్టించుకోకపోవడంతో వినియోగదారులు మెకానికల్ మీటర్లను బిగించుకుంటున్నారు. ఇలా నగరంలోని వందలాది బల్క్ కనెక్షన్లలో ఇదే జరుగుతున్నదని వినియోదారులు వాపోతున్నారు. మెకానికల్ మీటర్ చెడిపోయి యావరేజి పేరిట జలమండలి అధికారులు రూ.ల క్షల్లో సంబంధిత అపార్ట్మెంట్లు, బల్క్ కనెక్షన్‌దారుల నుంచి వసూలు చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే తామేమీ చేయలేమని క్షేత్రస్థా యి అధికారులు తేల్చి చెబుతున్నట్లు వినియోగదారులు వాపోతున్నారు. ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసినా ఎలాంటి దిద్దుబా టు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. బిల్లులు, మీటర్ల పేరిట రూ.లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని జలమండలి అధికారులు కాజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యాప్రాల్‌లోని జనప్రియ ఆర్కెడ్ అనే అపార్ట్మెంట్లో బల్క్ కనెక్షన్ తీసుకున్నారు. 622306650 దీని క్యాన్ నెంబర్. కనెక్షన్‌తో పాటు ఆటోమేటెడ్ మీటర్ రీడర్‌కు జలమండలి అధికారులు రూ.2,25,000 వసూలు చేశారు. జలమండలి అధికారులు లైసెన్సలు ఇచ్చిన ఏజెన్సీ మీటర్‌ను బిగించలేదు. మీటర్ లేకుంటే కనెక్షన్ ఇవ్వబోమని అధికారులు చెప్పడంతో మరో రూ.40 వేలు వెచ్చించి మెకానికల్ మీటర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. కొద్దిరోజుల తర్వాత ఆ మీటర్ మరమ్మతులకు గురయ్యింది. మరమ్మతులు చేసేందకు ఏజెన్సీ, జలమండలి అధికారులు రాలేదు. దీంతో జలమండలి అధికారులు యావరేజి పేరిట లక్షలాది రూపాయలు బిల్లుల మోత మోగించారు. ఆ ఆపార్ట్మెంట్ వాసులకు ఏకంగా రూ.11,04,712 బిల్లు వేశారు. ఆ మొత్తాన్ని చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేస్తామని చెప్తున్నారు. ఇలాంటివి నగరంలో వందలాదిగా ఉన్నాయని వినియోగదారులు వాపోతున్నారు. అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా బిల్లుల మోత మోగించి, ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.