కాంగ్రెస్ సర్కారు అన్నదాతల ఉసురు పోసుకుంటున్నది. కష్టపడి పండించిన ధాన్యం, మక్కలను సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో.. కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. వర్షానికి భయపడి తిండీ తిప్పలు మాని అక్కడే పడిగాపులు గాస్తున్నారు. వరంగల్, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసుకున్న ధాన్యం, మక్కలు తడిసిముద్దయ్యాయి. వరద నీటిలో కొట్టుకుపోతున్న వడ్లను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు.
-నమస్తే తెలంగాణ నెట్వర్క్
నమస్తే తెలంగాణ నెట్వర్క్, వరంగల్, మే 8: అకాల వర్షానికి ఉమ్మ డి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధా న్యం, మక్కలు తడిసి ముద్దయ్యాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి గాంధీనగర్లోని కొనుగోలు కేంద్రంలో నిల్వ చేసిన 40 వేల బస్తాల ధాన్యం తడిసిపోయింది. రెండు వారాల క్రితం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన కాంటా వేయలేదు. లారీలు లేవంటూ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి సీతక్క ప్రారంభించిన గాంధీనగర్ కొనుగోలు కేంద్రంలోనే ఇలాంటి దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు చిన్నగూడూరు మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో అధికారులు టార్పాలిన్లు సమకూర్చకపోవడంతో వర్షానికి ధాన్యం రాసులు తడిసిముద్దయింది. వరంగల్ జిల్లా నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన మక్కలు నీటిపాలయ్యాయి. అధికారులు సకాలంలో కాంటా వేయకపోవడంతో గురువారం రాత్రి కురిసిన వర్షానికి మక్కలు తడిసి ముద్దయ్యాయి. దీంతో పలు గ్రామాల నుంచి మార్కెట్కు మక్కలు తెచ్చి న రైతులు జరిగిన నష్టంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. చెన్నారావుపేట మండలం తిమ్మరాయిన్పహాడ్ కొనుగోలు కేంద్రంలోని వడ్లు నీటిపాలయ్యాయి. కాంటా వేయకుండా రోజుల తరబడి అధికారులు జాప్యం చేయడంతో అకాల వర్షానికి ధాన్యం నీటిపాలైందని రైతులు ఆవేదన చెందారు. ఎల్లాయగూడెం తండా బోడ రవికి చెందిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరబోయగా కొట్టుకుపోయింది.

మరోవైపు నెల రోజులుగా మక్కలను కొనుగోలు చేయకపోవడంతో వర్షంతో నీటిపాలయ్యాయని రైతులు తెలిపారు. గాలివానకు పలుచోట్ల వరి పంట నేలవాలడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. నెక్కొండ మండల కేంద్రంలోని పణికర గుట్ట ప్రాంతంలో ఆరబోసిన మక్కలు త డిసిపోయాయి. అధికార యంత్రాంగం సకాలంలో కాంటా వేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు తెలిపారు. తక్షణమే గోదాముల్లోకి మక్కలను తరలించాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఏటూరునాగారం మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది.