పటాన్ చెరు, సెప్టెంబర్ 10 : కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు ఒకేసారి జలమండలి నీటి బిల్లును రూ.2.38 కోట్లు కట్టాలని బిల్ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేసి తాగునీటిని జలమండలి ద్వారా సరఫరా చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నీటి బిల్లులు చెల్లించాలని ఆదేశాలు ఇవ్వడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
పేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేసి పంపిణీ చేసిన కేసీఆర్ ప్రభుత్వం. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు కట్టాలని ఒత్తిడి చేయడంతో పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, కేసీఆర్ నగర్ బాధితుల సమస్యను వెంటనే పరిష్కరించాలి అని బీఆర్ఎస్ నాయకుడు బాలగౌని సాయిచరణ్ గౌడ్ అన్నారు.
నెలనెలా రావాల్సిన నీటి బిల్లులు ఒకేసారి రావడంతో వాళ్లంతా ఒక్కసారిగా కంగుతిన్నారని, గతంలో ఉచితంగానే నీటిని పొందిన వాళ్లు జలమండలి విధించే నీటిపన్ను పై రూ. కోట్లలో బిల్లులు కట్టాలంటే ఎలా అని ప్రశ్నించారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కేసీఆర్ నగర్ ప్రజలు ఎంత నీళ్లు వాడుకున్నారనే విషయం తెలుసుకునేందుకు మీటర్లు సైతం అమర్చకుండానే జలమండలి అధికారులు ఇష్టానుసారంగా బిల్లులు వసూలు చేస్తుండటం విడ్డురం అని అన్నారు.