ఇబ్రహీంపట్నంరూరల్/వికారాబాద్, నవంబర్ 24 : ముసురుకుంటున్న మంచు తెరలు, వణుకు పుట్టించే చలిగాలులు. వీటన్నింటి నుంచి కాపాడుతూ ఒంటికి వెచ్చదనాన్ని అందిస్తుంటాయి ఉన్ని దుస్తులు. స్వెటర్లు, జర్కిన్లు, శాలువాలు, టోపీలపై ప్రస్తుతం ప్రజలు ఆసక్తి చూపిస్తుండటంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. శీతాకాలంలో నాలుగు నెలలపాటు మన వెన్నంటే ఉండే వెచ్చని నేస్తాలు ఇవి. గతంలో గ్రామీణులు గొంగళ్లను కప్పుకునేవారు. ప్రస్తుతం ఆధునికత పెరుగడంతో ప్రజలు ప్రత్యేక దుస్తులను ఆశ్రయిస్తున్నారు. అందులోనూ కొత్తకొత్త వెరైటీల్లో లభించే స్వెటర్లను కొనుగోలు చేసి చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. చలికాలం వచ్చిందంటే ప్రజలు పెద్ద ఎత్తున ఉన్నిదుస్తులపైనే దృష్టి సారిస్తుంటారు.
నియోజకవర్గంలో వెలసిన విక్రయ కేంద్రాలు..
చలిగాలులు తీవ్రంగా వీస్తుండటంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వ్యాపారులు ఏటా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇబ్రహీంపట్నం, శేరిగూడ, బొంగ్లూరు, ఆదిబట్ల, యాచారం, మంచాల, ఆగాపల్లి, మాల్, గున్గల్, మంగల్‌పల్లి, ఆరుట్ల, దండుమైలారం, తుర్కయాంజాల్, మన్నెగూడ, రాగన్నగూడ ప్రాంతాల్లో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన వ్యాపారులు చలికాలంలో దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఉన్ని దుస్తులను పెద్ద ఎత్తున విక్రయిస్తారు. ఈ వ్యాపారులు ప్రతిఏటా నవంబర్ నుంచి జనవరి వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకుని ఉన్ని దుస్తులు విక్రయించి జీవనోపాధి పొందుతారు.
అందరికీ అందుబాటులో..
ఇప్పుడే పుట్టిన శిశువు నుంచి మొదలుకుని పండు ముసలి వరకు ప్రతిఒక్కరికీ స్వెటర్లు అందుబాటులో ఉన్నాయి. స్త్రీ, పురుషులకు వేర్వేరు డిజైన్లలో లభిస్తుండటం విశేషం. తల మొదలు కాళ్ల వరకు చలి నుంచి కాపాడుకునేందుకు ప్రజలు వివిధ రకాల దుస్తులను ధరిస్తుంటారు. చేతులకు గ్లౌజులు, మొదలుకుని చిన్నపిల్లల కాళ్లకు సాక్సుల వరకు అన్ని లభ్యమవుతున్నాయి. మంకీక్యాప్‌లు, మఫ్లర్లు, అందమైన డిజైన్లలో జర్కిన్లు, విక్రయిస్తున్నారు. రూ.200 మొదలుకుని రూ.2వేల వరకు వివిధ ధరల్లో వివిధ రకాల ఉన్ని దుస్తులను పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలోని ప్రధాన రహదారుల వెంట..
పట్టణంలోని షాపుల్లో కంటే ప్రధాన రహదారుల వెంట తాత్కాలిక షెడ్లు వెలిశాయి. నాణ్యతతో పాటు కొత్త డిజైన్లు, రంగు రంగుల్లో స్వెటర్లు లభ్యమవుతున్నాయి. చిన్న పిల్లలను ఆకట్టుకునే బొమ్మల టోపీలు, వృద్ధులకు మెత్తని శాలువాలు, యువతకు నచ్చే జీన్స్ టైప్ బటన్టైప్ పలు రకాలు ఉన్నాయి.
ధరలు ఇలా…
వ్యాపారులు మద్రాస్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి తెచ్చి పట్టణంలోని ఆలంపల్లి, బస్‌డిపో తదితర చౌరస్తాల్లో, రోడ్ల పక్కల తాత్కాలికంగా వేసిన షెడ్లలో విక్రయిస్తున్నారు. అదే పట్టణంలోని బీజేఆర్, మహశక్తి, ఎమ్మార్పీ చౌరస్తాల్లోని పలు దుకాణాల్లో లభ్యమవుతున్నాయి. షాపుల్లో కంటే ధరలు తక్కువగా ఉండటంతో రోడ్డు పక్కన వెలసిన దుకాణాల్లో కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. స్వెటర్లు చిన్న పిల్లకు రూ.250, రూ.500, రూ.1000 నుంచి రూ.1500వరకు ఆకారాలను బట్టి ధరలు ఉన్నాయి.
10 సంవత్సరాలుగా అమ్ముతున్నా..
స్వెటర్లను 10 సంవత్సరాల నుంచి అమ్ముతున్నా. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధరలు ఉన్నాయి. చలికాలం ప్రారంభం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తారు. పట్టణంలోని ప్రధాన చౌరస్తాల్లో తాత్కాలిక షెడ్లు వేసి విక్రయిస్తున్నా. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వివిధ ఆకారాలు, రంగుల్లో స్వెటర్లు ఉన్నాయి.