హనుమకొండ చౌరస్తా, మార్చి 22 : విద్యార్థులు కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ‘కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్’ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్ కోటేశ్వర్రావు సూచించారు. ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత విద్యావకాశాలపై ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’, ‘కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్’ సంయుక్తంగా హనుమకొండ జిల్లా దామెరలోని ఏకశిల క్యాంపస్‌లో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించాయి.
ఈ సందర్భంగా విద్యార్థులు ఇంటర్ త ర్వాత ఏయే కోర్సులు ఎంచుకోవాలనే దానిపై ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్ కోటేశ్వర్రావు అవగాహన కల్పించారు. బీటెక్ అనేది పదేళ్లుగా చాలా క్రేజీ ఉన్న కోర్సు అని, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో బాగా రాణించే విద్యార్థులు బీటెక్‌ను ఎంచుకుంటున్నారని, రానివారు బిజినెస్ మేనేజ్మెంట్ రంగం వైపు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 60 శాతం మంది బీటెక్ చేసినవారే సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు సాధించారని గుర్తుచేశారు. ఇంటర్ తర్వాత ఏ యూనివర్సిటీ.. ఏ కళాశాలను ఎంచుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు తపన పడుతుంటారని, ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో గూగుల్‌లో చూసి యూనివర్సిటీలను ఎంపిక చేసుకుంటున్నారని, తమిళనాడు, నార్త్ ఇండియా ప్రాంతాల యూనివర్సిటీలను ఎంచుకుంటున్నారని, ఇది కరెక్ట్ కాదన్నారు.
ఉత్తమమైన కెరీర్ కోసం నాలుగు రోజులు యూనివర్సిటీని నేరుగా పరిశీలించాలని, అందులో చదివే విద్యార్థులతో మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు.1980 నుంచి కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక విద్యా కేంద్రంగా విరాజిల్లుతోందని చెప్పారు. 42 ఏళ్లుగా ఎక్స్‌లెన్స్‌తో 2009లో డీమ్డ్ టుబీ యూనివర్సిటీ అయిందని, దేశంలోని కేటగిరీ-1లో పది యూనివర్సిటీలు ఉన్నాయని, ఇందులో కేఎల్ యూనివర్సిటీ కూడా ఒకటి అన్నారు. విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచే దృష్టి పెడితే అద్భుతాలు సృష్టిస్తారని చెప్పారు.
హైదరాబాద్‌లో 120 స్టార్టప్స్ ఉన్నాయని, సొం త ఇనిస్టిట్యూట్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగం విద్యార్థులను ఎంతగానో ఆకర్షిస్తున్నదన్నారు. విజ్ఞానం, మేధస్సుకు సవాల్‌గా భావించే సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ప్రతిభ, క మ్యూనికేషన్ సామర్థ్యం, నాయకత్వ లక్షణాలకు కా ర్పొరేట్ కంపెనీలు రూ.లక్షల్లో జీతాలు ఇస్తున్నాయని, అందుకే ఇంజినీరింగ్ విద్యకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని చెప్పారు. విద్యార్థులకు క్రమశిక్షణ చాలా అవసరమని, తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయవద్దని, ప్రస్తుత పోటీ ప్రపంచంలో టెక్నాలజీని మంచికి ఉపయోగించాలని సూచించారు. కేఎల్ యూనివర్సిటీలో లెక్చర్, ల్యాబ్, స్కిల్ డెవలప్మెంట్పై ప్రతి శనివారం ప్రత్యేకంగా గైడ్ చేస్తారని, ముఖ్యంగా బీటెక్ మూడో సంవత్సరంలోనే మంచి ప్లేస్మెంట్ ఉంటుందని, నాలుగో సంవత్సరంలో నెలకు రూ.40వేల నుంచి రూ.50వేల దాకా, బీటెక్ పూర్తయిన తర్వాత రూ.4లక్షల నుంచి రూ.5 లక్షల దాకా జీతాలు ఇచ్చే కంపెనీలు ఉన్నాయని గుర్తుచేశారు. విద్యార్థులు కేవలం చదువుపైనే కాకుండా అన్ని రంగాలపై దృష్టి పెట్టాలన్నారు.
తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటివరకు ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ దిన పత్రికలు బాగా ప్రాచుర్యం పొందాయని చెప్పారు. అవగాహన సదస్సు అనంతరం విద్యార్థులకు లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. ఇందులో ఇద్దరు లక్కీ కూపన్లు పొందిన విద్యార్థులు శ్రావ్యారెడ్డి, శశిప్రీతమ్చారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ బ్యూరో చీఫ్ పిన్నింటి గోపాల్‌రావు, అడ్వైర్టెజ్‌మెంట్ ఇన్చార్జి అప్పని సూరయ్య, ఏకశిల విద్యాసంస్థల డైరెక్టర్లు ముచ్చ జితేందర్‌రెడ్డి, దినేశ్‌రెడ్డి, యాంకర్ ఆదిత్యరాజ్, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ, ఏకశిల విద్యాసంస్థల సిబ్బంది పాల్గొన్నారు.
న్యూస్ పేపర్ రీడింగ్ ఉపయోగకరం
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 80 వేలకు పైగా ఉద్యోగాలను ప్రకటించింది. ఈ క్రమంలో సన్నద్ధత కోసం న్యూస్ పేపర్స్ రీడింగ్ ఉపయోగకరంగా ఉంటుంది. నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా సాగిన తెలంగాణ ఉద్యమానికి ఊతంగా నిలిచేందుకు నమస్తే తెలంగాణ పురుడుపోసుకున్నది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటింది. మన చరిత్రను వెలుగులోకి తెచ్చింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ఆవిష్కరించింది. ప్రతి బుధవారం ‘నిపుణ’ ద్వారా ఉద్యోగ సమాచారం, కెరీర్ గైడెన్స్, మెటీరియల్‌ను అందిస్తున్నది.
– పందిళ్ల అశోక్‌కుమార్, నమస్తే తెలంగాణ వరంగల్ బ్రాంచ్ మేనేజర్
లక్ష్యంతో ముందుకు సాగాలి
విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ దిశగా కష్టపడాలి. విద్యార్థులకు ఇంటర్ తర్వాత ఉన్నత విద్యావకాశాలపై ‘నమస్తే తెలంగాణ’ ‘తెలంగాణ టుడే’, ‘కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ’ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. బంగారు భవిష్యత్ కోసం మంచి యూనివర్సిటీలను ఎంచుకోవాలి. విద్యతో పాటు మానవీయ విలువలను సైతం అలవర్చుకోవాలి. ప్రతి విద్యార్థి కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. నేను కిందిస్థాయి నుంచి వచ్చి ఇప్పుడు విద్యాసంస్థల చైర్మన్‌గా ఎదిగాను. ఎన్నో బ్రాంచ్‌లు ఏర్పాటు చేశాను. ఏకశిల విద్యాసంస్థల్లో సుమారు 12 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇది వరంగల్‌లోనే టాప్ ఇనిస్టిట్యూట్.
– గౌరు తిరుపతిరెడ్డి, ఏకశిల విద్యాసంస్థల చైర్మన్
సదస్సులతో మేలు
ఎంచుకునే కోర్సులు, యూనివర్సిటీలపై నిర్వహించే ఇలాంటి అవగాహన సదస్సులు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయి. నేను కంప్యూటర్ సైన్స్ ఎంచుకుంటున్నా.. నా లక్ష్యం సైంటిస్ట్ కావడం. కష్టపడి చదివి మా అమ్మానాన్నల ఆశయాలను నెరవేర్చుతా. టెక్నికల్‌గా ముందుకెళ్లాలంటే కెరీర్ గైడెన్స్‌పై అవగాహన పెంచుకోవాలి.
– సంగం భానుప్రకాశ్, విద్యార్థి
చాలా యూజ్‌ఫుల్
మాది వరంగల్ జిల్లాలోని ఎస్ఆర్ఆర్ తోట. ఇంటర్ తర్వాత ఎంచుకోవాల్సిన కోర్సులు, యూనివర్సిటీపై ఈ సదస్సు విద్యార్థులకు ఎంతో యూజ్‌ఫుల్‌గా ఉంటుం ది. నేను ఇంటర్ తర్వాత మెకానికల్ ఇంజినీరింగ్ చేయాలనుకుంటున్నా.
– వంగరి సిద్ధార్థ్
ప్రణాళికతో ముందుకెళ్లాలి
కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇచ్చిన మార్గదర్శకాలు విద్యార్థులు జీవితంలో స్థిరపడేందుకు చక్కగా ఉపయోగపడుతాయి. వారు సూచించిన పద్ధతుల్లో ప్రణాళికాబద్ధంగా చదుకుంటూ ముందుకెళ్తే ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.
-పీ అఖిల, విద్యార్థి
అవగాహన అవసరం
ఇంటర్ తర్వాత ఉన్నత చదువులపై కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ నిర్వాహకులు చెప్పిన విషయాలు ఎంతో బాగున్నాయి. తపన ఉంటే ఏదైనా సాధించవచ్చు. లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని సాధించేదాకా కష్టపడి చదువాలి. ఎంచుకునే కోర్సు, యూనివర్సిటీ కూడా చాలా ముఖ్యమైనవి.
– హారతి
లక్ష్య సాధనలో ఊతం
చదువులో పట్టుదలతో ముందుకెళ్తున్న తరుణంలో ఇలాంటి అవగాహన సదస్సులు లక్ష్యాన్ని చేరుకునేందుకు ఊతంగా నిలుస్తాయి. క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది. మంచి క్యాంపస్‌ను సెలెక్ట్ చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది.
– ఎం.హాసిని
సాఫ్ట్వేర్ ఫీల్డ్‌లో రాణిస్తా..
ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాఫ్ట్వేర్ రంగం చాలా ముఖ్యమైంది. బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చేస్తా. విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఏకశిల, కేఎల్ విద్యాసంస్థలు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉంది. కెరీర్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడంలో మార్గదర్శకంగా ఉంది.
– సీహెచ్ వర్షిణి