ఇటీవల వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ ప్రకటన ఊరటనిచ్చింది. పరిహారం కోసం ఎదురుచూస్తున్న వారికి భరోసా ఇచ్చింది. త్వరలో ప్రభుత్వం నుంచి తమకు పరిహారం లభిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు బాధిత రైతులు. జనవరిలో మూడు రోజుల పాటు కురిసిన వానలతో పంటలకు తీవ్ర నష్టం కలిగింది. వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. స్పందించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. ‘అధికారులు వెంటనే నివేదిక అందించాలని, పంటలు దెబ్బతిని నష్టపోయిన అన్నదాతలను తప్పకుండా ఆదుకుంటామని స్పష్టం చేశారు.
వరంగల్, మార్చి 20(నమస్తేతెలంగాణ) : గత జనవరి 10 నుంచి 12వ తేదీ వరకు జిల్లాలో అకాల వర్షా లు బీభత్సం సృష్టించాయి. అనూహ్యంగా వడగండ్లు పడడంతో విధ్వంసం జరిగింది. ప్రధానంగా మూడు రోజుల పాటు కురిసిన వానలతో పంటలకు తీవ్ర నష్టం కలిగింది. పంట నష్టాలపై వెంటనే వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వివిధ మండలాల్లోని 191 గ్రామాల్లో వానలతో పంటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. 9,284 మంది రైతుల కు చెందిన 10,811 ఎకరాల్లోని మక్కజొన్న, వేరుశనగ, పొద్దుతిరుగుడు, జొన్న, మినుము, పెసర, నువ్వు తదితర పంటలకు నష్టం కలిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. 12,238 మంది రైతులకు చెందిన 15,565 ఎకరాల్లో మిర్చి, అరటి, పుచ్చ, మల్బరి, పూలు, పండ్లు, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లినట్లు ఉద్యానశాఖ అధికారులు ప్రభుత్వానికి పంపిన ప్రాథమిక నివేదికలో వివరించారు.
ఇందులో అత్యధికంగా మిర్చి పంట 14,686 ఎకరాలు ఉంది. వడగండ్ల వానతో మిర్చి పంటలో కేవ లం మోడులు మిగిలాయి. మిరప చెట్లు కొమ్మలు సహా విరిగి వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. చెట్లపై ఉన్న మిర్చి కూడా వరద పాలైంది. మక్కజొన్న, పొద్దుతిరుగుడు, బొప్పాయి, అరటి, ఇతర పండ్లు, పూలు, కూరగాయల పంటలదీ ఇదే పరిస్థితి. వీటిని చూసి ఆరుగాలం కష్టం పడిన రైతులు బోరుమన్నారు. చేతికందొచ్చిన సమయంలో వడగండ్లు ఊడ్చేయడంతో దిగుబడులే కాదు పెట్టుబడి సైతం కోల్పోయామని విలపించారు.
కలెక్టర్ బీ గోపితో పాటు వ్యవసాయ, ఉద్యాన శాఖల జిల్లా అధికారులు ఉషాదయాళ్, శ్రీనివాసరావు ఇతర అధికారులు, సిబ్బందితో కలిసి జిల్లాలో పంట నష్టాన్ని పరిశీలించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పలు గ్రామాలను సందర్శించి వానలతో నష్టం వాటిల్లిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధిత రైతులను ఓదార్చి పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ పంట నష్టాన్ని స్వయంగా ఆయన సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కొద్దిరోజుల క్రితం శాసనసభలో కూడా పంట నష్టంపై ఎమ్మెల్యే పెద్ది ప్రస్తావించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
రైతు వారీగా సర్వే నివేదిక..
సీఎం కేసీఆర్ ఆదేశాలతో పంట నష్టంపై రాష్ట్ర మంత్రుల బృందం జనవరి 18న జిల్లాలో పర్యటించింది. వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖల మంత్రు లు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు ఈ బృందంలో ఉన్నారు. నర్సంపేట మండలంలోని ఇప్పలతండాను సందర్శించి పంట నష్టాన్ని పరిశీలించారు. వివిధ గ్రామాల్లో పంట నష్టపోయిన రైతులతో ఇక్కడ మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో ప్రాథమిక అంచనాల తర్వాత వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులు పంట నష్టంపై జిల్లాలో రైతు వారీగా సర్వే జరిపారు. నష్టం వాటిల్లిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు నమోదు చేశారు. ఈ వివరాలను పారదర్శకత కోసం గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద డిస్ప్లే చేశారు. తర్వాత నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపారు.
నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట, ఖానాపురం, నెక్కొండ, గీసుగొండ, సంగెం, వరంగల్, ఖిలావరంగల్, పర్వతగిరి, రాయపర్తి మండలాల్లోని గ్రామాల్లో 19,803 మంది రైతులకు చెందిన 25,790 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నివేదికలో తెలిపారు. నష్టం జరిగిన వాటిలో మిర్చి, మక్కజొన్న, వేరుశనగ, పెసర, జొన్న, మినుము, అరటి, పుచ్చ, పొద్దుతిరుగుడు, పూలు, పండ్లు, కూరగాయలు తదితర పంటలు ఉన్నట్లు పేర్కొన్నారు. 12,565 మంది రైతులకు చెందిన 13,233 ఎకరాల్లో మిర్చి పంట ధ్వంసమైంది. ఈ మిర్చి రైతులకు రూ.7,14,61,157 నష్ట పరిహారం అందజేయాల్సి ఉంటుందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో వానలతో పంట నష్టపోయిన రైతులు పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. రైతు వారీగా పంట నష్టంపై సర్వే నివేదిక అందిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ శాసనసభలో రైతులను ఆదుకొంటామని, వారికి పంట నష్టం ఇవ్వడం పెద్ద కష్టం కాదని ప్రకటించారు. దీంతో త్వరలోనే పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందే అవకాశం ఉంది. తద్వారా జిల్లాలో 19,803 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.