విద్యార్థి దశ నుంచే శాస్త్రవేత్తగా ఎదిగేందుకు ఇస్రో(భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) తోడ్పాటునందిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు ప్రాధాన్యం కల్పిస్తూ యువికా-2022 పేరిట శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సాంకేతికతను అందిపుచ్చుకొని నూతన ఆవిష్కరణల వైపు నడిపించే లక్ష్యంతో విద్యార్థులకు ఈ అవకాశం కల్పిస్తోంది. ఈమేరకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, ఎంపికైన విద్యార్థులకు ఐదు ప్రాంతాల్లో శిక్షణ ఇవ్వనుంది.
గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తూ యువ విద్యార్థుల్లో అంతరిక్ష పరిజ్ఞానం, సాంకేతికత పట్ల ఆసక్తిని మరింత పెంచేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) కృషిచేస్తోంది. ఇందులో భాగంగా యువ శాస్త్రవేత్తలను తయారుచేయాలనే లక్ష్యంగా దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. యువికా (యువ విజ్ఞాన కార్యక్రమం)-2022 పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశానికి అవసరమైన సాంకేతికతను అందిపుచ్చుకోవడం, నూతన ఆవిష్కరణల వైపు యువతను నడిపించడం, అంతరిక్షంపై మక్కువను పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ శిక్షణకు హాజరుకానున్న విద్యార్థులకు రవాణా చార్జీలు, బస, భోజన వసతితో పాటు అన్ని సౌకర్యాలను ఇస్రో కల్పిస్తుంది. అర్హులైన విద్యార్థులు www.isro.gov.in ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా ఈ నెల 10 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. ఎంపిక జాబితాలను ఏప్రిల్ 20న ప్రకటించి అర్హత సాధించిన వారికి సమాచారం అందజేస్తారు.
దరఖాస్తు విధానం ఇలా..
విద్యార్థులు నాలుగు దశల్లో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ప్రతి దశలో జాగ్రత్తగా వివరాలు నమోదు చేయాలి. అసంపూర్తి అప్లికేషన్లను పరిగణనలోకి తీసుకోరు.
స్టెప్-1. యువికా-2022 కోసం విద్యార్థులు ఈ-మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
స్టెప్-2. క్విజ్ సూచనలు చదవడం, ఈ-మెయిల్ 48 గంటల వ్యవధిలో ఇస్రో ఏర్పాటు చేసిన ఆన్లైన్ క్విజ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.
స్టెప్-3. క్విజ్ ఆప్‌లోడ్ చేసిన 60 నిమిషాల తరువాత యువికా పోర్టల్‌లోని ఆన్లైన్ దరఖాస్తులో పూర్తి వివరాలు నమోదు చేసి సమర్పించాలి. అనంతరం డౌన్లోడ్ చేసుకోవాలి.
స్టెప్-4. దరఖాస్తుతో పాటు విద్యార్థి సంతకం చేసిన ప్రతిని, విద్యార్థి మూడేళ్లలో వివిధ అంశాల్లో రూపొందించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలి.
అర్హులు వీరే..
మార్చి 1, 2022 నాటికి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ యువికా కార్యక్రమానికి అర్హులు. వీరికి ఎనిమిదో తరగతిలో వచ్చిన మార్కులతో పాటు గత మూడు సంవత్సరాల్లో పాఠశాల, జిల్లా, రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌లో పాల్గొని ఉండాలి. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్ సభ్యుడై ఉండాలి. పంచాయతీ పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థులకు ఎంపికలో వెయిటేజ్‌కు ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి రాష్ట్రం నుంచి విద్యార్థుల భాగస్వామ్యం ఎంత నిష్పత్తిలో ఉండాలో నిర్ధారిస్తారు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా చివరి తేదీని ఏప్రిల్ 10గా నిర్ణయించారు. ఏప్రిల్ 20న ఇందుకు సంబంధించిన తాత్కాలిక జాబితాను ఇస్రో విడుదల చేయనుంది.
ఐదు శిక్షణ కేంద్రాలు
ఎంపికైన విద్యార్థుల కోసం ఐదు కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు.
1. విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్. తిరువనంతపురం.
2. యూఆర్‌రావు శాటిలైట్ సెంటర్, బెంగళూరు.
3. స్పేస్ అప్లికేషన్ సెంటర్. అహ్మదాబాద్.
4. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. హైదరాబాద్.
5. నార్త్-ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్, షిల్లాంగ్.
మే 16 నుండి 28 వరకు..
ఎంపికైన విద్యార్థులకు వేసవి సెలవుల్లో మే 16 నుంచి 28 వరకు 13రోజుల పాటు శిక్షణ ఇస్తారు. పూర్తిగా రెసిడెన్షియల్ పద్ధతిలో ఉంటుంది. విద్యార్థితో పాటు తల్లిదండ్రుల్లో ఒకరు లేదా గైడ్ ఉపాధ్యాయుడికి కూడా ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. శిక్షణ తర్వాత శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లి అక్కడి విశేషాలను ప్రత్యక్షంగా చూపించి అవగాహన కల్పిస్తారు.
శాస్త్రవేత్తగా ఎదిగేందుకు తోడ్పాటు
విద్యార్థి దశ నుంచే శాస్త్రవేత్తగా ఎదిగేందుకు యువికా తోడ్పాటు అందిస్తుంది. జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్యాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 10వ తేదీ వరకు ఎక్కువ సంఖ్యలో నమోదు చేసుకునేటట్లు చర్యలు తీసుకోవాలి. అభ్యర్థులు ప్రతి దశలో జాగ్రత్తగా వివరాలు నమోదు చేయాలి.
– బీ స్వామి, జిల్లా సైన్స్ అధికారి, జయశంకర్ భూపాలపల్లి
గడువులోగా నమోదు చేసుకోవాలి
ఆసక్తి ఉండి అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రోత్సహించాలి. అదే నెల 20న ఎంపిక జాబితా ప్రకటిస్తారు. మే 16 నుంచి 28 వరకు ఎంపికైన విద్యార్థులు ఐదు కేంద్రాలను సందర్శిస్తారు.
– అప్పని జయదేవ్, జిల్లా సైన్స్ అధికారి, ములుగు