నయీంనగర్, మార్చి 20: వృత్తికి సంబంధించి, జీవితంలో ఎదురైన అనుభవాలను సత్యాపథంగా గ్రంథస్థం చేస్తే.. ఆ గ్రంథం భవిష్యత్ తరాలకు మార్గదర్శనం అవుతుందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అన్నారు. ఆదివారం హనుమకొండ నయీంనగర్‌లోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాలలో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బన్న ఐలయ్య అధ్యక్షతన బండారి అంకయ్య రచించిన నాలో నేను పుస్తక పరిచయ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మహాకవులు, మహనీయులు రాసుకున్న ఆత్మకథలు వారి జీవితాలకు సంబంధించిన అంశాల చుట్టూ తిరుగుతాయని తెలిపారు. కానీ, అంకయ్య తన ఆత్మకథలో జీవితాన్ని ప్రభావితం చేసిన సామాజిక, సాంసృతిక అంశాలు, రజాకార్ల అకృత్యాలతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు వరకూ అనేక అంశాలను పొందుపరిచి భావితరాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఆచార్య బన్న ఐలయ్య మాట్లాడుతూ బండారి అంకయ్య శ్రీకాకుళంలో పని చేసిన సందర్భంలో కాళీపట్నం రామారావు కథానిలయానికి స్థలం కేటాయించిన గొప్ప సాహిత్యకారుడన్నారు. ఆయన జీవితంలోని అనేక ఘట్టాలను ఉదహరిస్తూ ఒక్కో ఘట్టానికి ఒక్కో శీర్షిక పెట్టి గొప్ప పరిశోధన గ్రంథంగా వెలువరించారని చెప్పారు. ఆయన జీవిత చరిత్ర నేటి తరాలకే కాక.. భావితరాలకు స్ఫూర్తిదాయకమని చెప్పారు.
అనంతరం ప్రముఖ రచయిత డాక్టర్ కర్రె సదాశివ్ గ్రంథాన్ని అద్భుతంగా సమీక్షించారు. రచయిత బండారి అంకయ్య మాట్లాడుతూ తెలంగాణలో 1947 నుంచి ఇప్పటి వరకు జరిగిన రాజకీయ, సామాజిక, సాంసృతిక అంశా లు, తన జీవితంలో ఎదురొన్న కష్టాలు, కన్నీళ్లు, సంతోషాలను గ్రంథంలో పొందుపరిచానన్నారు. ముఖ్యంగా నాటి సంఘటనలు నేటి తరానికి తెలియజెప్పాలని ఈ రచన చేశానని అన్నారు. కార్యక్రమంలో హనుమకొండ ఏసీపీ మూల జితేందర్‌రెడ్డి, నాగిళ్ల రామశాస్త్రి, పీ కోదండ రామారావు, బండారు రామ్మోహన్రావు, బండారి శ్రీకృష్ణ, డాక్టర్ చిర్ర రాజు, పొట్లపల్లి శ్రీనివాసరావు, వీఆర్ విద్యార్థి, కవులు, మేధావులు పాల్గొన్నారు.