స్టేషన్ ఘన్పూర్, మార్చి 20 : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులివ్వకుండా కులాలు, మతాల పేర ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు. విభజన హామీలు నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకుడు చింతకుంట్ల నరేందర్‌రెడ్డి నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 36 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ తక్కువ కాలంలోనే సీఎం కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉండడంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. దీన్ని ఓర్వలేని బీజేపీ కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్యన చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నదన్నారు.
తెలంగాణలోని నదీ జలాలపై మన హక్కులు కాపాడుకోవాలంటే సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష అన్నారు. బీజేపీ పాలనలో దేశంలోని అనేక రాష్ర్టాల్లో పేదలు మరింత పేదవాళ్లుగా మారుతున్నారని కడియం విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం లేదని, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించడం లేదన్నారు. ఇన్ని ఇబ్బందులున్నా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంటే కాళ్లలో కట్టె పెట్టి అడ్డుకుంటున్నారన్నారు. ఇక్కడ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు ఓవైపు ప్రశంసలు కురిపిస్తూనే, మరోవైపు ఏ మాత్రం సహకరించకుండా అడ్డుకుంటున్నారని శ్రీహరి అన్నారు.
మోదీ మెడలు వంచే సమయం వచ్చింది
తెలంగాణలో రెండో పంటగా వరి వేయొద్దని ప్రధాని నరేంద్రమోదీ చెబితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం ‘వరి వేసుకోండి, కేంద్రం మెడలు వంచైనా ధాన్యం కొనుగోలు చేయిస్తామని’ చెప్పారని కడియం శ్రీహరి అన్నారు. మోదీ మెడలు వంచే సమయం బండి సంజయ్‌కి వచ్చిందన్నారు. పది రోజుల్లో కల్లాల్లోకి యాసంగి ధాన్యం వస్తుందని, రైతుల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చకుముందే ఇకనైనా కేంద్రం స్పందించాలన్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్ కేంద్రాన్ని ఒప్పించి ప్రతి గింజనూ కొనేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశా రు. లేకుంటే తెలంగాణ ప్రజ లు మిమ్ములను తరిమికొడతారని హెచ్చరించారు. బీజేపీ నాయకులు చేతగాని, చేవలేని మాటలు మాట్లాడొద్దన్నారు. చేతనైతే ధాన్యం కొ నుగోలు చేసేలా మోదీని ఒప్పించి తెలంగాణ ప్రజలపై తమకున్న ప్రేమను చూపించాలని హితవు పలికారు.
త్వరలో జంబో నోటిఫికేషన్ రాబోతున్నది..
సీఎం కేసీఆర్ ఓ వైపు సంక్షేమ రంగానికి పెద్ద పీట వేస్తూనే, నిరుద్యోగులను ఆదుకునేందుకు త్వరలో జంబో నోటిఫికేషన్ ఇవ్వనున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తెలిపారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో 91,142 ఖాళీలను గుర్తించామన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు మంత్రులు, ఆయా శాఖల అధికారులకు సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. నియామకాల ద్వారా ప్రభుత్వంపై సంవత్సరానికి రూ.7 వేల కోట్ల ఆర్థిక భారం పడుతుందన్నారు. దళితబంధు పథకం ద్వారా రాష్ట్రంలో 2 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయనున్నారని పేర్కొన్నారు. సొంత స్థలం ఉండి నివాసం లేని పేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి రూ.3 లక్షల చొప్పున, నియోజకవర్గానికి మూడు వేల మందికి సాయం చేయనున్నారని శ్రీహరి తెలిపారు. విలేకరుల సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెళ్లి కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు బెలిదె వెంకన్న పాల్గొన్నారు.