గీసుగొండ, మార్చి 20 : మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర మూడో రోజు వైభవంగా సాగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో ఉద్యోగులు, వ్యాపారులు కుటుంబ సమేతంగా జాతరకు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచే జాతరకు భక్తుల తాకిడి పెరిగింది. ఇప్పటి వరకు సుమారు 2లక్షల పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో శేషగిరి, ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్‌రెడ్డి తెలిపారు. రద్దీ పెరుగడంతో భక్తులు గంటల కొద్దీ క్యూలైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. పోలీసులు, చైర్మన్ భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టారు. అలాగే, గత ఏడాది కంటే ఈసారి అమ్మకాలు పెరిగాయని వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా తో భక్తుల రాక తగ్గి తమకు నష్టం జరిగిందన్నారు. రంగులరాట్నంతో పాటు జెయింట్ వీల్స్, చిన్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన జంపింగ్ స్కూటర్, ట్రైన్లలో ఎక్కి భక్తులు ఎంజాయ్ చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా సీఐ వెంకటేశ్వర్లు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మామునూరు ఏసీపీ నరేశ్‌కుమార్, నర్సంపేట ఏసీపీ ఫణీందర్ జాతరను పర్యవేక్షించారు. అలాగే, ఏసీపీ నరేశ్‌కుమార్ జన్మదినం సందర్భంగా గీసుగొండ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఏసీపీ ఫణీందర్, నర్సంపేట సీఐ పులి రమేశ్, దుగ్గొండి సీఐ సూర్యప్రసాద్, గీసుగొండ ఎస్సైలు పెండ్యాల దేవేందర్, వెంకన్న తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే చల్లా..
గీసుగొండ : కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామిని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా రోడ్లపై నీళ్లు చల్లాలని సూచించారు. జీపీ ట్యాంకర్ల ద్వారా తాగు నీటిని అందించాలని అధికారులను ఆదేశించారు. దర్శనం వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈవో శేషగిరికి సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, ఆలయ ఫౌండర్ శ్రీనివాసాచార్యులు, సర్పంచ్‌లు వీరాటి కవిత, రజిత, నాగేశ్వర్రావు, జైపాల్‌రెడ్డి, ప్రకాశ్, మండలాధ్యక్షుడు వీరగోని రాజ్‌కుమార్, కార్యదర్శి చల్లా వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.