వరంగల్‌చౌరస్తా, మార్చి 20: భవిష్యత్ అంచనాలకు తగినవిధంగా రూపొందించిన ప్రణాళికల ప్రకారం రాజీలేని అభివృద్ధి పరంపరను నిరంతరాయంగా కొనసాగిస్తామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ 28వ డివిజన్ పరిధిలోని భద్రకాళి బండ్ ప్రాంత అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మర్రి రవీందర్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించినందుకు కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. అనంతరం నన్నపునేని మాట్లాడుతూ తూర్పు నియోకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. తాను మేయర్‌గా ఉన్ననాటి నుంచి సంతోషిమాత కాలనీ, సాయినగర్ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాలనీవాసుల ప్రధాన సమస్యగా ఉన్న ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) సమస్య పరిష్కారానికి అసెంబ్లీలో మాట్లాడినట్లు తెలిపారు.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. త్వరలోనే ఎఫ్టీఎల్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, డివిజన్ నాయకులు కొలిపాక శ్రీనాథ్, నవీన్, భద్రకాళి బండ్ ప్రాంత అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే 25, 26వ డివిజన్ల పరిధిలో రూ. మూడు కోట్లతో కొనసాగుతున్న రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధి పనులను పరిశీలించారు. త్వరలోనే రోడ్డు పనులను పూర్తి చేసి ప్రజలకు సౌకర్యం కల్పిస్తామన్నారు. అనంతరం 26వ డివిజన్ కార్పొరేటర్ బాలిన సురేశ్ తన నివాసంతో ఎమ్మెల్యే నరేందర్, 25వ డివిజన్ టీఆర్ఎస్ నాయకుడు బస్వరాజు శ్రీమాన్‌ను సత్కరించారు.
టీఆర్ఎస్ హయాంలోనే ఆలయాల అభివృద్ధి
మన సంస్కృతీ సంప్రదాయాలకు చిహ్నాలుగా నిలిచే ఆలయాలను అభివృద్ధి చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నదని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. వరంగల్ 24వ డివిజన్ పరిధిలోని గోపాలస్వామి ఆలయ ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొని కమిటీ చైర్మన్‌గా తోట నవీన్‌కుమార్, ధర్మకర్తలుగా ఇరుకుల్ల రమేశ్, బెజగం రజినికాంత్, ఎం పద్మ, సోనుతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధూప దీప నైవేద్య కార్యక్రమం ద్వారా సీఎం కేసీఆర్ తెలంగాణవ్యాప్తంగా వేలాది ఆలయాలకు నిధులు మంజూరు చేశారన్నారు. వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, ప్రత్యేక శ్రద్ధతో ఎక్కువ మొత్తంలో నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు.
సుమారు 70 సంవ్సతరాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ ప్రాంతంపై తాను ప్రత్యేక దృష్టి సారించి మౌలిక వసతుల కల్పనతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. అంతేకాకుండా సుమారు రూ. 1100 కోట్లతో మల్టీసూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టడంతోపాటు వరంగల్‌కు మోడల్ బస్టాండ్, ప్రధాన కూడళ్ల అభివృద్ధి, స్మార్ట్‌రోడ్డు పనులను చేపట్టామని వివరించారు. అనంతరం ఆలయ నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే నరేందర్‌ను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, 28వ డివిజన్ కార్పొరేటర్ కల్పన, దిడ్డి కుమారస్వామి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీ రమేశ్‌బాబు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట సంపత్, టీఆర్ఎస్ నాయకులు నీలం రాజ్‌కిశోర్, గోరంటల మనోహర్, దుబ్బ శ్రీనివాస్, శిరీశ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం
ఖిలావరంగల్: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 28, 29వ తేదీల్లో నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. శివనగర్‌లో ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. కేంద్రం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నదని ధ్వజమెత్తారు. ఈ నెల 25న బైక్ ర్యాలీ, 28న నగరంలోని 9 కేంద్రాల్లో రాస్తారోకోలు, బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం, 29న నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ ఆటోల బంద్ ఉంటుందన్నారు. సదస్సులో టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు బోగి సరేశ్, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, నాయకులు ఇనుముల మల్లేశం, మర్రి శ్రీనివాస్, ఖాజీం, గాదె కుమార్, గడల రమేశ్, మైదం నరేశ్, రాములు, రాజయ్య, భిక్షపతి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కాన్యదర్శి గన్నారపు రమేశ్, ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్ల రమేశ్, శ్రీధర్‌రావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ముక్కెర రాసమస్వామి, ఐఎఫ్టీయూ గంగుల దయాకర్, ఆరెళ్లి కృష్ణ, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదరి ఉప్పుల రవి, టీఆర్ఎస్ నాయకుడు మంద శ్రీధరెడ్డి పాల్గొన్నారు.
క్యాలెండర్ ఆవిష్కరణ
కరీమాబాద్: తెలంగాణ రజక దోబీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్యే నరేందర్ పెరుకవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుల వృత్తులకు పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కుమారస్వామి, తెలంగాణ రజక దోబీ అభివృద్ధి సంస్థ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.