హనుమకొండ, మార్చి 7 : మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది. మహిళా సాధికారతకు కృషి చేస్తుంది. షీటీంలు, సఖీ, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల కార్యక్రమాలు చేపడతుంది. మహిళలు ఒకరిపై ఆధారపడకుండా స్వశక్తితో ఎదగాలి అని అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం ఆమె ‘నమస్తే తెలంగాణ’తో కొంత సేపు ముచ్చటించారు.
నమస్తే తెలంగాణ : మహిళా సాధికాతకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏమిటి ?
అదనపు కలెక్టర్ : యువతులు, ఒంటరి మహిళల వేధింపుల తదితర అంశాలకు సంబంధించి షీటీంలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నారు. నిర్భయ చట్టం అమలులోకి రావడంతో నిందితులను శిక్షిస్తున్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళల కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. బాల్య వివాహాల నిర్మూలన, బాలకార్మికుల గుర్తింపు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టికారం అందించడంతో పాటు ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తూ పోషకాహారం అందజేస్తున్నారు. బాధిత మహిళలకు సత్వర న్యాయం చేకూరేందుకు ఐసీడీఎస్, పోలీసు శాఖల ఆధ్వర్యంలో సఖీ, భరోసా సెంటర్లు ఏర్పాటు చేశారు. అంతేకాక న్యాయపరంగా, ఆర్థికంగా ఆదుకుంటారు. మహిళకు తోడ్పాటు అందించే విధంగా సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. అదేవిధంగా చట్ట సభల్లో సైతం మహిళలకు పెద్దే పీట వేస్తున్నారు.
ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది ?
రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా మహిళల సంక్షేమం కోసం అద్భుత పథకాలు అమలు చేస్తుంది. మాతా శిశు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు పోషకాలు ఉండే విధంగా పోషకాహారం పంపిణీ చేస్తున్నది. గర్భిణులను 104 ప్రత్యేక వాహనం ద్వారా దవాఖానకు తీసుకెళ్లి ప్రసవం అనంతరం కేసీఆర్ కిట్ అందజేసి, తల్లి పిల్లలను ఇంటి వద్ద చేర్చడమే కాకుండా ఆర్థిక సాయం అందజేస్తుంది. నిరుపేదల వివాహాల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నది.
మీరు అనుకున్న లక్ష్యం నెరవేరిందా ?
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యాన్ని చేరుకున్నాను. రెవెన్యూ శాఖలో ఉద్యోగం రావడం మంచి అవకాశంగా భావించాను. డిప్యూటీ తహసీల్దార్‌గా నియామకం కావడంతో నా కోరిక నెరవేరింది.
సర్వీస్‌లో మరిచిపోని సంఘటన ఉందా?
ఉంది… అది ఏమిటంటే ప్రభుత్వ ఉద్యోగిగా నా విధులు నిర్వర్తిస్తూనే నిరుపేదలకు ఆర్థిక సాయం చేసి ఆదరించడం, అలాగే నిరుపేద విద్యార్థులకు సాయం చేయడం, హాస్టళ్లలోని విద్యార్థులకు దాతల నుంచి సహాయ సహకారాలు చేయించడం లాంటివి మరిచిపోలేని ఘటనలు.
యువతులకు మీరు సందేశం ఏమిటి ?
ప్రస్తుతం యువతులు లక్ష్యాలను చేరుకోకుండా పోతున్నారు. సోషల్ మీడియా, ఇంటర్నెట్కు ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. వీటి ద్వారా పరిచయమై ముక్కు మొహం తెలియని వ్యక్తులతో మోసపోతూ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. జీవితం ఎంతో విలువైంది. ముందుగా లక్ష్యాలను ఎంచుకుని భవిష్యత్‌కు మంచి పునాది వేసుకోవాలి. ఆ తర్వాతే తల్లిదండ్రుల సూచనల మేరకు మాత్రమే వివాహ ఆలోచనలు చేయాలి తప్ప ఆకర్షణకు లోనై జీవితాలను మధ్యలోనే పాడు చేసుకోవద్దు.