సుబేదారి, మార్చి 7 : పట్టుదల, నమ్మకం, సరైన ప్రణాళిక ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చు. ప్రభుత్వ అధికారిగా సేవ చేస్తేనే ప్రజలకు కొంతలో కొంత మేలు కలుగుతుంది. అందుకోసమే నాన్నతో చర్చించి సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేశా. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని 2010-11 సంవత్సరంలో హైదరాబాద్‌లో సివిల్స్ కోచింగ్ తీసుకున్నాను. ఇంటర్వ్యూ వరకు వెళ్లినా ఉద్యోగం రాకపోవడంతో బాధపడ్డాను. ఏడాది తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చింది. కష్టపడి చదివి డీఎస్పీ ఉద్యోగం సాధించాను అని అదనపు డీసీపీ కే పుష్పారెడ్డి అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం ‘నమస్తే తెలంగాణ’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
కుటుంబం నేపథ్యం..
మాది వైజాగ్‌లోని ఎల్బీనగర్. మేం నలుగురు ఆడపిల్లలం. నాన్న ఎరోనాటికల్ ఇంజినీర్. నేను ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు వైజాగ్ నవోదయ స్కూల్లో చదివాను. బీటెక్ శారద ఇంజినీరింగ్ కళాశాలలో పూర్తిచేశాను. నేను పాఠశాల స్థాయిలో స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో రాణించాను. మానాన్న ఎయిర్‌ఫోర్స్‌లో ఎరోనాటికల్ ఇంజినీర్ కావడం, డ్రెస్‌లో నాన్నను చూసినప్పుడు నాకు కూడా డ్రెస్ కోడ్ జాబ్ చేయాలనే ఆసక్తి కలిగింది. బీటెక్ చదివిన తర్వాత హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలో మంచి వేతనంతో కూడిన సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. నాజాబ్ క్రెడిట్ కార్డ్స్ కోడింగ్ చేయడం .ఇలా మూడున్నర సంవత్సరాలు పనిచేశాను. కానీ, ప్రైవేట్ కంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించి ప్రజలకు సేవ చేయాలని నాకు అనిపించింది. నాన్నతో చర్చించి ఈ ఉద్యోగానికి రాజీనామా చేశాను. అప్పుడు అమ్మ కోపగించుకుంది.
నాన్న నా మీద నమ్మకంతో పెద్ద ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తది అని చెప్పేవారు. హైదరాబాద్‌లో సివిల్స్ కోచింగ్ తీసుకుని పరీక్షలు రాశాను. ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. మిస్సైందని బాధపడ్డాను. ఎలాగైన ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కంకణం కట్టుకున్నాను. గ్రూప్-1కు ప్రిపేర్ అయ్యాను. పరీక్షకు హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులో మా ఊరు వైజాగ్‌కు వెళ్లాను. సెంటర్‌కు వెళ్లేవరకు 15 నిమిషాలు ఆలస్యమైంది. ఒక్కటే టెన్షన్.. స్కాడ్‌కు బస్ టికెట్ చూపించగానే సెంటర్లోకి పంపించారు. ఎగ్జాం రాశాను. నాకు డీఎస్పీ ఉద్యోగం వచ్చింది.
డీఎస్పీ పోస్టింగ్- ప్రేమ పెళ్లి
నేను గ్రూప్-1లో డీఎస్పీ ఉద్యోగం సాధించిన తర్వాత శిక్షణలో నల్లగొండకు చెందిన ప్రస్తుతం ములుగు కలెక్టర్‌గా ఉన్న కృష్ణఆదిత్యతో పరిచయం ఏర్పడింది. ట్రైనింగ్ తర్వాత హైదరాబాద్‌లో నాకు సీఐడీ సైబర్ వింగ్‌లో ఫస్ట్ పోస్టింగ్. తర్వాత కల్వకుర్తి డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాసార్ కృష్ణ ఆదిత్య నేను బందోబస్త్ డ్యూటీ చేశాం. ట్రైనింగ్ పరిచయం కృష్ణ ఆదిత్యతో ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కులాలు వేరు కావడంతో నేను మా తల్లిదండ్రులను, ఆయన వారి తల్లిదండ్రులను ఒప్పించారు. 2014లో ఆయన సివిల్స్‌కు సెలక్ట్ అయ్యారు. అదే ఏడాది ఆగస్టు 15న మా పెళ్లి జరిగింది. పోలీస్ ఆఫీసర్‌గా బాధితులను ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కన్నీళ్లు కూడా వస్తాయి.మహిళలను మనుషులుగా ఎందుకు ఆదరించడంలేదు. మన ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారు కదా.. వారిలాగానే బయట వారిని కూడా చూడాలనే ఆలోచన అనేది లేకుండా పోతుంది. అందరూ మహిళలను గౌరవించాలి.