సుబేదారి, మార్చి 6 : క్రీడలు మానసిక ఉల్లాసాన్నిస్తాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో మూడురోజులుగా హనుమకొండ జేఎన్ఎస్లో నిర్వహిస్తున్న క్రీడల ముగింపు కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. పరుగుపందెం, కబడ్డీ, టగ్ ఆఫ్ వార్ ఫైనల్ పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహనలో బిజీగా ఉండే పోలీసులకు మానసిక ఉల్లాసాన్ని కలిగించడానికి క్రీడలు దోహదపడుతాయన్నారు. శాంత్రిభద్రతల పరిరక్షణలో వరంగల్ పోలీసులకు రాష్ట్రంలోనే ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయాలతో అధానాతన వాహనాలు, సాంకేతిక పరికరాలను పోలీసు శాఖకు సమకూర్చిందని తెలిపారు. పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తూనే, ప్రమోషన్లు ఇస్తున్నదని గుర్తుచేశారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి ఏటా పోలీసు క్రీడలు నిర్వహించాలని మంత్రి పోలీసు ఆఫీసర్లకు సూచించారు. ఆయా పోటీల్లో గెలుపొందిన వారికి మంత్రి మెడల్స్, అవార్డులు అందజేశారు.
ఏసీపీ నాగయ్యపై సీపీ ఆగ్రహం..
సుబేదారి : పోలీసు స్పోర్ట్స్ మీట్‌కు ఇన్చార్జిగా వ్యహరిస్తున్న ఏఆర్ ఏసీపీ నాగయ్య, ఇతర పోలీసు అధికారులపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ పాటించకపోవడంతో మందలించారు.
స్పోర్ట్స్‌కు అనువైన ప్రాంతం వరంగల్..
వరంగల్ నగరం స్పోర్ట్స్‌కు అనువైన ప్రాంతమని అర్జున అవార్డు గ్రహీత, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల అన్నారు. హనుమకొండ బాలసముద్రం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతన్న పోలీసు స్పోర్ట్ అండ్ గేమ్స్ మీట్ ముగింపు కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. ఈ సాంస్కృతిక నగరంలో ఎన్నో జాతీయ క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారని గుర్తు చేశారు. ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని కోరారు. క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయన్నారు. తాను వరంగల్‌కు రావడం రెండోసారి అని వివరించారు. క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుందన్నారు. వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్, హైజంప్, షాట్‌పుట్, స్విమ్మింగ్, 200, 400 మీటర్ల పరుగు పందెం విజేతలకు బహుమతులు అందజేశారు.
స్పోర్ట్స్ హబ్‌గా వరంగల్..
– ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయభాస్కర్
చారిత్రక వరంగల్ నగరాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఎడ్యుకేషన్, హెల్త్, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిందని, ఇప్పుడు సోర్ట్స్‌లో కూడా వరంగల్‌కు ప్రధాన్యమిస్తున్నదన్నారు. మూడు నెలల క్రితమే నేషనల్ అథ్లెటిక్స్ మీట్ ఘనంగా నిర్వహించామన్నారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. క్రీడల వల్త ఒత్తిడి తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, పోలీసు ఆఫీసర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.